అంశం : అడవి పువ్వు
తేది: 23-10-2020
శీర్షిక: స్వయంచలిత సంజాతలు ....
సంఖ్య : 546
దుక్కి దున్నిన దాఖలాలు
నారు పొసే హాలికులు
నీరు పెట్టే ఆసాములే
అక్కరలేని అడవి కుసుమాలు
స్వయంచలిత సంజాతలు ....
చెఱువు కట్టలు చేను చెలకలే
పోడు భూములు బీడు నేలలే
చెక్కు చెదరని దిక్కు దాపరులు
పసిడి రంగుల అడివి పూలకు ....
వెన్నెల తలపించే గునుక వనాలకు
పసిడి సొగసుల వన్నెలద్దె తంగేళ్లకు
పగడాలు పూయించే గోగుపూలకు
సెలయేటి అలల సింగారించుకునే
రంగు రంగుల గడ్డి పూలకు అడ్డాలు
ఈ పచ్చని అడివితల్లి....
ఆచార వ్యవహారాల పట్టింపులు లేవు
కఠిన నియమాల కట్టుబాట్లు లేవు
నిరాశ నిట్టూర్పుల ఊసులు ఎరుగవు
కపట కల్మషాల నీలి నీడలు కానరావు
మనసార మురిసే మమతలు పంచు ...
కమ్మని అందాలను కనువిందు చేస్తూ
బహుదూరపు బాటసారులకు బాసటై
బంగారు ఛాయల సింగారు కాంతులను
బహుచక్కగా పంచు..... బతుకు జీవనాన...
అడవులు కూడా ఆదాయ వనరులాయె
పెట్టుబడి దారుల తొత్తులవుతున్న
అడ్డదారుల గుడ్డి పాలక ప్రాపకాలలో
దొడ్డిదారుల బహుమతుల దళారులకు....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment