Tuesday, August 11, 2020

అగ్ని ధార తేది:22-07-2020 (2)

అగ్ని ధార
తేది:22-07-2020
శీర్షిక: అక్షరీకరించే ప్రతి పదం... 
సంఖ్య: 471

బొక్కల గూడును కుప్పేసుకుని
ముప్పదిలో ఏబది ముసుగేసుకుని 
మెలిపెట్టే డొక్కలోని ఆకలిని ముల్లెకట్టి
తడబడే అడుగులను అదిమిపట్టి
పిడచగట్టే నాలుకను గడ్డకట్టించి 
పంచ ప్రాణాలను ఉగ్గపట్టి 
పంటిబిగువున ఒంటిచేత్తో 
బండి బరువును లాగుతుంటే 
శ్రామికునికి దక్కని శ్రమ సౌందర్యం
ఎవరికి మాత్రం కలుగదు బాధ?  

మంటిలో మానెడు ఇంటిలో 
పుట్టెడు అంటారేగానీ .... 
ఆరుగాలం శ్రమలే మిగులు 
అరకదున్నే రైతన్నకు ...... 
దుక్కి దున్నింది మొదలు.... 
విత్తనాల నాసిరకంతో 
వింత గొలుపు కష్టాలు ...... 
అతి వృష్టి అనావృష్టిలతో 
ఆరుగాలం ఆపసోపాలు ....... 
కీటకాల బెదడలు కాటికంపే కల్తీలు ...... 
పంటచేతికొచ్చేవరకు ప్రతిక్షణం నరకమే......
అంతా సజావుగా అయిపోయినా 
ఆదుకునే మద్దతు ధర అనిశ్చితం..... 
హాలికునికందని ప్రకృతి ఫల సాయం... 
దళారీలకందే దండి లాభాలు .... 
ఇంకెందుకు రాదు నశాళానికి కోపం.... ?

చలి మంచుల దుప్పటి కప్పుకుని
ఎండా వానలు ముడుచుకోగా 
పక్కలో బళ్ళాన్ని....  ఉక్కు సంకల్పాల
మొక్కవోని ధైర్యంతో మునగదీసి.... 
దేశ ప్రజల కోసమై నిరంతరం
దేహమంతా శ్వాసిస్తూనే
తృణప్రాయంగా బలిదానమయ్యే 
కుటుంబాలకు కబోది ప్రభుత్వాల 
కంటితుడుపు చర్యలు సైతం 
కానరాకుండ పోయె....కల్పించుకుని
కలిగించుకునే తీరికలే కరువాయె..... 

దర్జాలువెలగబట్టే ధవళ వస్త్ర నాయకులు
బూర్జువాల విధానాల బల్లకింది అధికారులు
గర్జంచి మొరిగే రౌడీ గ్రామసింహాలు
కపటబాజి కుట్రల కబోది దళారులు
నయవంచన మోసాల నవ విధ వ్యాపారులు
కొంతమంది పాలేనా.... కోటి యజ్ఞాల ఫలం....
ప్రశ్నించే ప్రతి పదం కణ కణ మండే   
అక్షరీకరించిన అగ్నిధారే.... 


నగునూరి రాజన్న 
కరినగరము

No comments:

Post a Comment