ప్రత్యేక కవిత 1 & 2
శ్రావణ ముసుర్లు
అప్పులోళ్ల బాధలకు
అలిగిన ఆసాములోలె
వెలుగులీనే దినకరుడు
వెక్కి మొఖం చాటేశాడు...
కునుకు మొఖం వాసిన
సుద్దుల సరిహద్దు జవానుకు
కాల్పుల ఒప్పందపు ఉల్లంఘనల్లా
ఘడియ గడియకు చినుకుల జలతారు....
వానా వానా వాళ్ళప్పంటూ
చిన్న నాటి ఆటా పాటా
చిలుక పలుకుల మాటలు
గిలిగింతలు పెట్టి చుట్టేస్తున్నది.....
ఊటీ డార్జిలింగుల చల్లదనాలు
ఉట్టిపడుతున్నట్టు తోచగానే
ఊష్ణ పకోడీల రుచికోసం ఉలికిపడి
ఉసికొలిపి రెక్కలు తొడిగి నా ఊహలకు....
****************************** ******
శ్రావణ ముసుర్లు -2
ప్రాణవాయువు ప్రథమమైనా
ప్రాణాధారమే నీరు సుమా....
అప్పనంగా దొరికితే అలుసే మరి
కొని తాగినా మారని మానవ నైజo ....
రెండు పాళ్లు నీళ్ల తో
జీవరాశి భూమండలం
చెప్పకనే చెప్పింది సత్యం
నీరెంత ప్రాధాన్యమో ....
విజ్ఞులు చెప్పినా... శాస్త్రం వివరించినా
పంచభూతములన్నీ పరోపకారులే
పొదుపు పొదుపంటే పొదువుకోరు
పొదుపుగ వాడరు కుదురుగ వినరు జనం .......
పర్యావరణం లోపిస్తే అనావృష్టి
ప్రకృతమ్మ కోపిస్తే అతివృష్టి
వరద బీభత్సాలు వరుస తుఫానులు
వళ్ళమాలితే వాలిపోవు సునామీలు ....
వర్షపు నీరంటే వరదాయిని
వాగు వంకలకెంతో వన్నెతెచ్చు
నదీమ తల్లులకు జీవమది
నాగరికతలకు నాందీ పలికింది ....
బావిలో నీటిని బకెట్టేసి తోడుకున్నట్టు
నల్ల కింద కుడి చేయుంటే
నల్ల మీద ఎడమ చేయుంటేనే
చేయూత అవుతుంది పొదుపుకు
శ్రీకారం పడుతుంది అదుపుకు ....
చదువులే లేనప్పుడు
పాపా పుణ్యాల భయమే
పరిణతి కలిగితే స్వచందమే ...
చదువుండి పరిణతి లేపోతేనే
అలసత్వాల తంటాలు .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment