నగునూరి రాజన్న
కథా రచన-1 మొదటి స్థానం దక్కించుకున్న కథ
శీర్షిక : ఊరు సౌకర్యం
తేది: 02-08-2020
*******************
పచ్చ పచ్చని పంట పొలాలతో మట్టి వాసనలు పరిమళిస్తూ ఆ పల్లె చూపరులకు అందాలను పంచుతూ ఆహ్లాదాలను మూటగట్టి మురిపించేది.
అన్నీ ఉన్నా ఏదో వెలితి అన్న చందంగా, ఆ ఊరిలో సమావేశాలకు, పెళ్లిళ్లకు, పేరంటాలకు ఒక చిన్న సౌకర్యం కూడా లేదు. అందరూ ఇబ్బంది పడేవారు... మగవాళ్ళు ఆడవాళ్లు విసుక్కునే వారు, కానీ తర్వాత ఎవరూ పట్టించుకునే వారు కాదు. కొంత మందేమో గ్రామ పంచాయితీ చూసుకోవాలి అనేవారు... కొంత మంది ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేవాళ్లే కానీ అమలుదాకా తెచ్చేవారే కరువు...
ఇదంతా గమనిస్తున్న సత్యనారాయణ అనే ఓ స్వాతంత్ర్య సమర యోధుడు మాత్రం ముందుకు వచ్చి, తాను కొంత మొత్తం డబ్బు సమకూర్చి తనలా ఆలోచించేవారిని ఒకరిద్దరిని కలుపుకుని వారివద్ద నుండి కూడ కొంత అప్పుగా తీసుకుని ముందు అందుబాటులో ఉన్న ఒక చక్కటి ప్రాంతములో స్థలాన్ని సేకరించి పెట్టారు. ఇప్పుడు ఇక ఆఊళ్లో ఉన్న అందరికి నమ్మకం పెరిగింది. అయన మాట మీద ఇంకా గౌరవం ఏర్పడింది. ఇక ఆ మహానుభావుడు సత్యనారాయణ గారు ఏమి చెప్పినా అందరు వినే స్థితికి వచ్చారు.
కూడబెట్టిన డబ్బంతా కలిపి స్థలమైతే కొన్నారు. కానీ ఇక అసలు కథ ఇప్పుడు... చాలా డబ్బు కావాలి ఎలా ఎలా అని ఆలోచిస్తున్న తరుణంలో మళ్ళీ ఆ స్వాతంత్ర్య సమరయోధుడైన సత్యనారాయణ గారికే ఓ చక్కని ఆలోచన మెరిసింది..
వెంటనే ఆ ఊరిలో ఉన్న మోతుబరి రైతులను చిన్న చిన్న వ్యాపారులను ఒక తాటి మీదకు తెచ్చి తనకు వచ్చిన ఆలోచన చెప్పి వచ్చే ఐదు సంవత్సరాలు తన ప్రణాళికలో కుదిరినవారు ఏబది మంది తన మాట మీద నడుచుకోవాలంటూ ప్రతిపాదించాడు. ఎవరికీ ఒక్క రూపాయి ఖర్చులేని విధంగా చెప్పిన ప్రణాళిక అందరికీ ఆమోదయోగ్యమై ప్రతివాళ్ళు తమ తమ ఆమోదం తెలిపి ముందుకు కదిలారు.
ఒకానొక శుభ ముహుర్తాన ఆయనంటే అమితంగా ఇష్టపడే నలుగురు యువకులకు పని కల్పించి ప్రణాళికలోని మొదటి అంకం ప్రారంభించాడు.
ఆరు నెలల్లో కొంత డబ్బులు చేతికి అంది.... పనులకు శ్రీకారం చుట్టారు. మొదటి సంవత్సరం వరకు ఇంకా కొన్ని డబ్బులు చేతికి అందగానే పనులు చక చకా నడవడంతో, నాలుగవ సంవత్సరం మొదటినాటికల్లా
ఎనభై శాతం పనులు పూర్తి చేసుకుని అందరు సంతోషంగా ఉన్నారు.
విధి వక్రించి చిన్న చూపు చూసింది. ఆ ఊరిలో విస్తరించిన డెంగీ మహమ్మారి వలన ఆ స్వాతంత్ర్య సమరయోధుడు కన్ను మూసారు. ఊరు ఊరంతా శోక సముద్రములో మునిగి పోయింది. వారి కుటుంబమైతే ఇంక తేరుకోడానికి ఆరు మాసాల పైమాటే అయ్యింది.
ఆ స్వాతంత్ర్య సమరయోధుడైన సత్యనారాయణ గారి కుమారులు ఒక్క రూపాయి ఎవరిని యాచించకుండా, చీటీలు నడుపుతూ దాదాపు ఏబది లక్షల ప్రణాలికను సాంతంగా అర్థం చేసుకుని , ఆ ఏబది మందికి తాము పూచీగా నిలిచి, అనుకున్న ప్రకారంగా మిగతా ఆరు నెలల్లో సమావేశ మందిర నిర్మాణం మొత్తంగా పూర్తి చేశారు.
ఇక ఆ ఊరి జనం గుండెల్లో స్వాతంత్ర్య సమరయోధుడైన సత్యనారాయణ గారు
సదా నిలిచిపోయారు. ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు.
ప్రారంభోత్సవం రోజున జరుపుకున్న మొదటి
సమావేశములోనే ఊరి కోసం చేసిన అతని మంచి తనాన్ని కీర్తిస్తూ, అతని త్యాగానికి గుర్తుగా ప్రజలంతా ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. సగర్వంగా " స్వాతంత్ర్య సమరయోధుడైన శ్రీ సత్యనారాయణ గారి " కాంస్య విగ్రహాన్ని నాలుగు బజార్ల కూడలిలో నిలపాలని.
అనుకున్నట్టే వారి ప్రతమ వర్ధంతికి విగ్రహాన్ని నిలిపి ఆ ఊరి ప్రజలు ఎంతో గౌరవంగా నివాళులు సమర్పించారు.
****************
సమాప్తం....
ఇది నా స్వీయ రచన. మన వేదిక కొరకు ఈ రోజు వ్రాసినదేనని హామి ఇస్తున్నాను. ఎక్కడా ప్రచురించబడలేదు.
నగగునూరి రాజన్న
No comments:
Post a Comment