కరోనా...ఓ కరోనా 2
21-03-2020
కలిసి కట్టుగా ఎదిరిద్దాం
కుక్కుటములు పొట్టేల్లు మిక్కుటమంటివి
మీన మేషములకేమో వంత పాడితివి
మత్తుపానీయముల తెగ చిత్తడి చేస్తివి
కాయగూరలకు కనీస విలువ లేదంటివి
పండ్లు ఫలహారమంటే... ఫరువ లేదంటివి... ఓ మానవా..
అది ఇది అను తేడాలు మరిచితివి
అడుగు ముందుకేసి అన్ని కావాలంటివి
కనిపించిన ప్రాణి నెల్ల
కబళించ చూసితివి....
పెడ రెక్కలు విరిచి పచ్చి ముక్కలు నోట కరిచి ...
కనికరములు వీడి కర్కోటకములు చాటి... .ఓ మానవా...
శుచి శుభ్రతలను ఎద్దేవా జేసితివి
మడి ఆచారాలను మంటగలిపితివి
సంస్కృతి సంప్రదాయాలను అటకెక్కించివి
ఆడిపాడితివి అడ్డగోలు తైతక్కల పబ్బుల్లో క్లబ్బుల్లో
వీడితివి నీతి నియమాలు నిజాయితీ
క్రమశిక్షణలు .... ఓ మానవా!
మనిషి వివేచనం చాల గొప్పదని
జీవకోటిపై ఆధిపత్యం వచ్చెనని
నీకు నీవే కితాబులిచ్చుకుంటే...ఏల ?
చూడు జరిగిందేమిటో ప్రత్యక్ష సాక్ష్యం....
విర్రవీగే క్షణం నీదికాదని విశ్వ నీరాజనం ... తెలుసుకో మానవా !
ప్రకృతైనా ప్రకోపిస్తే ప్రచండమైన
పర్యావరణ పర్యవసానమే అవదా !
తఫాను వరదలే కాదు మిత్రమా
తుడిచిపెట్టుకుపోయే సునామీలు కూడా!
చలిచీమల చేత చంపబడ్డ బలమైన సర్పమల్లే
సాంతంగా మానవాళిని కబళించగల సూక్ష్మ క్రిమిని... నేను !
అహర్నిశలు అసమతుల్యతలను ఆహ్వానిస్తే
అనుచితాలను అనుసరిస్తే అసూయలను పోషిస్తే
అనాహ్వానితంగానైనా అరుదెంచనా .... కరోనాగా !
అనామికనై నిలిచినా... అచంచల విశ్వాసం తో
అదుపు చేయగలవు మిత్రమా...మీరంతా కలిసికట్టుగా నిలిస్తే ..!
నగునూరి రాజన్న
కరీంనగర్
No comments:
Post a Comment