ఆలాపన
తేది 03-03-2020
శీర్షిక: కనులు మూసినా......
సంఖ్య: 363
ముదము గొలిపే ముచ్చటైనను
మదిని తాకిన మతలబైనను
అంతరంగమును కదిలించిన అచ్చెరువైనను
ఆత్మను తట్టిన అపురూపమైనను
మరుపురాని మెరుపు సంఘటనలైనను
దిగ్భ్రాంతిని దిగమింగిన దిటవైనను
ముప్పిరిగొన్న ముచ్చమటల భయానకమైనను
మసక మసకగా మనోఫలకంపై కదలాడుతూ
మనసున కలవరిస్తూ మాటన పలవరిస్తూ
సమయాసమయాలను సందర్భాలను మరచి
కనులు మూసినా.... తెరిచినా......
కంఠం సవరించినా ....
కంఠం సవరించినా ....
లోలోపలి లోతుల్లోని స్మరణకు సంకేతమై
అప్రయత్నపు అలవాటుగ.... అలవోకగా...
పలవరించే పలుకులు....నిలువరించే నీడలు....
ఆలపించే అప్రయత్నపు మధుర గీతాలు.....
మధు మాసపు ఉదయ సంధ్యన
పల్లె తరువుల పచ్చని మలయ మారుతంలో
పక్షుల కిల కిలా రవము కూడిన
నులివెచ్చని రవి కిరణాన
నెచ్చెలినుదురు తాకే ముంగురుల
ముగ్ద రూపం పదే పదే మనమున
దోబూచులాడుతున్నది......
నగునూరి రాజన్న
కరీంనగర్
No comments:
Post a Comment