Saturday, July 13, 2019

పుట్టినిల్లు

పుట్టినిల్లు
తేదీ - 12-07-2019
శీర్షిక - అందమైన చిరునామా
సంఖ్య - 234

అమ్మా నాన్నలను అన్నదమ్ములను 
అక్క చెల్లెళ్లను ఆదరముగ కానుకగా ఇచ్చి 
ఆత్మీయతానురాగాలకు ఆలవాలమయ్యింది .... 

వచ్చి రాని పలుకులకు  తొలి అడుగుల సవ్వడులకు  
చిలిపి ఆట పాటలకు శివాలెత్తిన ఏడ్పులకు .....  
గురువు నేర్పని విద్యలన్నింటికి  పాఠశాలయ్యింది .... 

ఇరుగు పొరుగు స్నేహాలను  ప్రాణాలిచ్చే ఆప్తులను 
బంధు బలగాలనిచ్చి  నాగరికత నడతలు నేర్పి   
చక్కని బ్రతుకుకు బాటలు వేసింది ...... 

చదువు సంధ్యలు నేర్పి బతుకు ఉపాధులు కూర్చి 
అర్థం చేసుకునే భాగస్వామినిచ్చి ఆనందాల పిల్లలనిచ్చి
కుందనంగా ఓ ఇంటివాణ్ణి చేసింది...... 

చదువులకని కొన్నాళ్ళు దూరమయినా ....  
కొలువులకని చాన్నాళ్లు విడిచి వెళ్లినా ... 
అమ్మ నాన్నలను ఆప్యాయంగా చూసుకున్నది... 

బతుకు బందిఖానాలో అలుపు సొలుపుల అరమరికలతో 
బంధువోలె వచ్చి పోతే తడిమి చేరదీసింది.... 
తెలియకుండానే  ప్రాణ సమమయ్యింది ....... 

హోదా నిచ్చి సంఘంలో హుందాగా నిలిపింది
పుట్టినిల్లు పుట్టినూరు తరాల వారధిగా  జన్మ భూమియై 
భువిపైన నాకొక అందమైన చిరునామా నిచ్చింది....      
ఆపాద మస్తకం చల్లని తోడు నీడయ్యింది..  

No comments:

Post a Comment