Sunday, July 21, 2019

నన్ను బతకనివ్వండి

అంశం - నన్ను బతకనివ్వండి
తేదీ - 15-07-2019
శీర్షిక  - బ్రతుకు బ్రతుకనియ్యి
సంఖ్య - 236

బ్రతుకు బ్రతుకనియ్యి కనీస జీవకోటి ధర్మం 
బ్రతకాలంటే పక్కవాణ్ణి తొక్కడమే నేటి మర్మం
భౌగోళిక బ్రతుకున గోచరిస్తున్నది భయం భయం.... 

భ్రూణమైనా బుజ్జగించని మానవ ప్రేతాత్మనం 
వర్తనాన వరుసబెట్టి సాగిస్తున్న వైద్య దమనం 
ప్రశ్నించదా ప్రతినిమిషం మానవత్వ దైన్యం....  

నాగరికతలో మార్పు చెందినదంటున్న నవీనత్వం 
ఎక్కడేసిన గొంగళి అక్కడే అంటున్న మనిషి తత్వం
ఎవరికీ అందుబాటు కానీయని విద్యా వివేకత్వం ........ 

పైశాచికాల  ఆనందపు రాజకీయ రణరంగం
పైసున్నోడి పలుకుబడికే కడుతున్న పట్టం 
పేదోడికి పాలనలో చోటు ఇవ్వని వైనం .....  

సుద్దులను కాల రాస్తూ బుద్దులు మరుస్తున్న మతం
సరిహద్దులు దాటుతున్న తీవ్రవాద మూకల ముష్కరం   
అసలు మానవత్వమే ప్రశ్నార్థకమౌతున్న విశ్వం ..... 

ఆడ మగ సమానమేనంటూ అధికార ఉపన్యాసం 
బాధ్యతలు పంచకుండ హక్కులు అందకుండ జాగరూకం 
చరిత్రలో మిగిలిపోవు నీలి నీడల చమత్కారం ..... 

పచ్చకోక కప్పుకున్న ప్రకృతి వృక్షరాజం
జీవకోటి  మేలు మరుస్తున్న రాబందుల రాజకీయం 
చెట్టు చేమ గుట్ట గూడు ఇసుక నీరు కబళిస్తున్న స్వార్థపరత్వం.....
  

నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం USA)

No comments:

Post a Comment