Saturday, July 13, 2019

పడమటి సంధ్యారాగం

పడమటి సంధ్యారాగం
తేది - 08-07-2019
శీర్షిక-  రాబోవు తరాల సంధ్యారాగాలాపన .... 
సంఖ్య - 230

అనాగరికత నుండి నాగరికతలో అడుగిడిన మానవుడు 
ఆలోచనా సరళి వల్లనో... ఆచరించిన పద్ధతి వల్లనో.... 
అనుక్షణం ఆనందాలను వెతుక్కుని  ఆస్వాదించాడు.... 
అన్నపానీయాల అలవాట్లతోనో... 
అక్కున చేర్చుకున్న విధి విధానాలతోనో ....  
ఆర్థికాంశాల పరిమితులతోనో.... ఆచార వ్యవహారాలతోనో... 
కలిమి లేముల కపట నీతులతోనో.... తెలివి తేటల కొలమానాలతోనో... 
కలిసి ఉండలేని తత్వాలతోనో... స్వార్థ చింతన సంకుచితాలతోనో... 
కట్టుబాట్ల కబంధ హస్తాల పాలనలతోనో .....  
విజ్ఞాన వివేకాలతోనో.... వివేచనా విచక్షణలతోనో ..... 
కలల సామ్రాజ్యాలను వెతుక్కున్న మానవుడు 
కదిలి పోయి కల్పించుకున్న సమూహాలలో 
అడుగడుగున సంతోషాలను పెంచుకుని 
ఆనందాల ఉభయ సంధ్యలను పంచుకున్నాడు... 

తూరుపు తొలి సంధ్య బాల్యపు ఆనందాలను తలపిస్తే 
చిటపటల మధ్యాహ్నం చిరు యవ్వనాలను గుర్తు చేస్తుంటే 
పరుగు లాంటి జీవితాన్ని ప్రతి నిమిషం ఆస్వాదిస్తూ 
అలసి సొలసిన అపసోపాల మేను తనువున 
పడమటి మలి సంధ్య సైతం పరవశాల ఆనందాలు 
పల్లవించాలని ప్రగాఢమైన అంచనాలు వేస్తున్నాడు ... 

ఆలోచనల వేగం పెరిగి.... సమాచార వేగం పెరిగి ..... 
ప్రయాణాల వేగం పెరిగి .....వలసల జీవితాలు పెరిగి  
విశ్వ దూరాలు తగ్గి ..... విధి విధానాలు మారిపోయి  
తూరుపు పడమటి సంధ్యల విరామంలోనే 
విశ్వవీధుల భౌగోళీకాలు దాటుతున్న మనిషి మాత్రం 
అనునిత్యం యాంత్రికత్వాన్ని అనుకరిస్తూ 
ఆనందాల పరిధి తగ్గిందని మాత్రం  .... ఆక్రోశిస్తున్నాడు.....

పదే పదే ఇతరుల తప్పొప్పులు వెదికే మనిషి 
రవంతైనా తాను మారడానికి సాహసించడు......
వేచి పరికించి చూడాల్సిందే రాబోవు తరాల 
పడమటి సంధ్యారాగాలాపన సంగతులు........  


No comments:

Post a Comment