అంశం - విసనకర్ర
తేదీ - 09 -07 -2019
శీర్షిక - స్థితప్రజ్ఞతకు చిహ్నం ....
సంఖ్య - 231
పర్యావరణ హితమైన పంకాను నేను
పత్రహరితం నుండి జన్మించినాను
వనిత చేత వయ్యరం ఒలికించినా ....
వంట చెరుకు మంట రగిలించే
వంటింటి వటుడినై నిలిచాను....
తాటాకులతో నన్ను జత చేర్చినా
ఈతాకులతోడ నన్ను ఇమిడ్చినా
వెదురు బద్దలతో కుదురుగా పేర్చినా
సిలుకు గుడ్డలతో సిత్రంగ కుట్టినా
వెల్వెట్టులతోడ నిలువెల్ల అలంకరించినా.
మయూర పింఛముల లాంఛనంగా మలిచినా
కుంగలేదు ...పొంగలేదు....
స్థితప్రజ్ఞతకు చిహ్నమై నిలిచాను నేను ....
రాజైన పేదైనా స్వేదం చిందించే
కర్షక కార్మికుడెవరైనా రక్తి కట్టించాను...
కరెంట్ కూలర్లు ఏ సి లు లేని కాలాన
చల్ల గాలులిచ్చి ఎల్లవేళలా కాచుకున్నాను ....
ధవుడి రాజసం దర్బారునందైనా
మాధవుడి పవిత్రమైన కోవెలందయినా
ఊష్ణాల ఊసులు ఊపందుకోనీక
అనుక్షణం నేను అంగరక్షకుడినై నిలిచాను....
పేదింటిలో పుట్టి పెన్నిధిగా నిలిచినా
రాజ దర్భారునందు దర్పం వెలగబెట్టినా...
నవ నాగరికతల కనుసన్నల్లో మీరంత నన్ను మరిచినా....
దైవాల కోవెలలో శాశ్వతమైన దండి బతుకు నాది మిత్రమా ....
No comments:
Post a Comment