అంశం - ఎడ్ల బండి-
తేదీ 06-07-2019
ప్రకృతితో లయమైన మానవుడు
పర్యావరణ కలుషితమెరుగని జీవుడు
హితమైన రవాణా నాటి పల్లె సాధనం.....
ఇంధనాల ఖర్చు లేని బుద్ది కలిగిన ఇగురం....
కఱ్ఱతోని ఇల్లు బోలు కమనీయపు కచ్ఛురం
సమకాలీన నాగరికతకు అద్దమైన సాధనం
తాళ్ళతోడ తమాయించు మూడువైపుల రక్షణం
ఆత్మీయపు అనుబంధాల చిక్కపు లతల తోరణం...
సంసారపు నావ నడిపే చక్కని భార్య భర్తలకు
సాంప్రదాయ తెరల తీయని బంధనాలోలె....
ఇరుసే కేంద్రమై నడుచు ఇరు చక్రాలు
ఇంత చిన్న కందెన శీల ఆధారంగా....
ప్రత్యక్షమో పరోక్షమో ఇరుగు పొరుగు
ప్రతి నిమిషం పరికించి కాచుకున్న విధం ....
అర్ధ చంద్రాకారపు గొడుగై నీడనిచ్చు
వెదురు తడిక చూడ ముచ్చటై రమణీయం...
నొగండ్ల పొడిగింపుల్లో ఎద్దులు నిలుచు ముద్దుగా
కాని కనాల తోడ తోలు జోళ్ళ బంధనాలు తోడవగా
జాతరైన యాత్రకైన జత కలిగి నడచు భువిపైన....
రెండెద్దులు తోడుంటే ఎదురులేదు మనిషి పయనాన....
పంట పొలాల పాటి రవాణాకైనా
పసిమి వన్నెల పంట ఇంటికి చేరాలన్నా
ప్రతి నిమిషం రైతుకు ఆయువు పట్టొలే ...
ఎవుసానికి గట్లమీద ఏరువాకకు ఊతమిచ్చు
పాడి పంటలు ఇంట జేరిన పవిత్రమంటూ
సంకురాత్రి సంబరాలన్నీ తీర్చుకుందురు
పశువులను పనిముట్లను భలేగా అలంకరించి
బతుకులోన ఆనందాలను సదా వెదుక్కుందురు
రాముడని లక్ష్మణుడని ముద్దుపేర్లు మా ఎద్దులకు
దాపల రాముడుంటే వలుపల లక్ష్మణుడుండి
పరుగులిడుతూ పయనమంత పదిలపరుచేవి
సంసారపు నావ లాగ సక్కంగ లాగించుచుండె .....
ప్రతి నిత్యం మా బాల్యమంతా బంగారుమయం చేస్తూ ....
నాటి మానవ మేధకు సమకాలీన వెలుగొందిన చక్రం
పర్యావరణ హితవు ప్రయాణ సాధనమై ఫరిడవిల్లినా ....
పురావస్తు శాఖలోనే పుణ్యమూర్తిగా మిగులునేమో....
రమ్యమైన అలంకారమై రాబోవు తరాలను రంజింపజేయ .....
No comments:
Post a Comment