Wednesday, November 7, 2018

రాజకీయం 22-10-2018

అంశం: రాజకీయం 
22-10-2018
శీర్షిక : అదే రాజకీయం....... 
సంఖ్య : 81

పురుడు ఎవ్వరు పోశారో ... 
పేరు ఎవ్వరు పెట్టారో .... 
యుగాలు మారినా ..... ....... 
పలుకడానికే భయం, సిగ్గు, జుగుప్స 
అన్నీ కలగలిపిన అవాంఛితం....... 

కాయ కష్టం చేసుకొని 
కడుపుకింత 
కలో గంజో తాగి 
కాళ్ళు ఆర జాపే నిరక్షరాస్యులు  కొంత మంది...... 

అష్టకష్టాలు పడుకుంటూ లేచి 
ఆరుగాలం కష్టపడైనా సరే 
అన్నపూర్ణకు మారు పేరై 
అందరికి అన్నం పెట్టాలనే 
సద్బుద్ధుల  ఆరాటం  కొందరికి ..... 

ఎండా,వాన,చలి 
ఏ కాలమైనా..... 
రాత్రి పగలు ఒళ్ళు హూనం చేసుకుంటూ 
దేశ సరిహద్దులే నిత్య జీవితం కొందరికి ........ 

ఏ కష్టం తెలువకుండా 
నక్కి నక్కి అక్కడివి ఇక్కడ 
ఇక్కడివి అక్కడ చేర్చి 
అమాంతం పడగలెత్తే గుంట నక్కలు  ఇంకొందరు....... 

సందట్లో సడేమియా లాగ 
ఈళ్ళందిరిని ఎక్కి తొక్కడానికా అన్నట్టు 
చదువు సంధ్యలు అవసరం లేని తోడేళ్ళు ..... 
కాయ కష్టం అక్కరలేని కఠిన హృదయులు ........ 
దర్జాగా దోచుకోవడానికి అలవాటు పడ్డ 
జూలు లేని సింహాలు ....... 
ఎవరికీ తెలియని అంతుపట్టని  రాజమార్గం 
అదే అదే రాజకీయం ..... 

ఇంత జరిగినా ఈసడించుకుంటామే తప్ప ...... 
ముందుకొచ్చి మార్గదర్శకం చెయ్యం గాక చెయ్యం. 
ఎందుకంటే అదొక రొచ్చు  రాజకీయం......... 
ఎవ్వరైనా దాసోహం అవ్వాల్సిందే....... 
వావి వరుసలు లేని జాతి ....... 
అదే అదే రాజకీయం  ....... 

నగునూరి రాజన్న 
కరీంనగర్ (HYD ) 

No comments:

Post a Comment