అంతెర్నేత్రం
తేది : 23-07-24
శీర్షిక : అసలైన అంగ వైకల్యం
సహస్రాధికం
కనుముక్కు తీరు కమనీయం
కాలు చెయ్యి కూడా కడు సవ్యం ....
చెవిటి మాలోకం అసలు కానే కాదు
మాట తీరైతే బహు మంచి తేనె...
ఉరుకుల పరుగుల జీవితాలతో
ప్రశాంతతలు కరువైన ప్రాణం ...
శ్వాసను మూసలో పోసుకుని
ఊపిరి ఉగ్గబట్టుకున్న ఉదంతాలే ...
అయినా బంక మట్టిలో అందమైన
కుండను చూడలేని అంధత్వమే ...
మానవత్వంలో మంచితనం
గుర్తించలేని గుడ్డితనమే ....
దూరాలోచన లేని దురాలోచనలే ....
ఎప్పుడూ ఒక వేలు మాత్రం
ఎదుటివారికేసి చూపడమే ....
నాలుగేళ్లు మనవైపున్నాయనే
మాట మరిచిపోయే తత్వాలే.....
మంచి చెడుల మాటెలా ఉన్నప్పటికీ
ముంచడం వస్తే చాలు బతికేయొచ్చు ...
ఆయనంటే ఈయనని ....ఈయనంటే
ఆయనని అందరు అదే రాగం ...
మనమేమిస్తే అదే వస్తుందనే సూత్రం
అందరూ మరిచి ప్రవర్తించడమే ....
అందరు మనకేమిచ్చారని కాకుండా
మననుండే మొదలవ్వాలని మరిచిన వైనం ....
ఆత్మపరిశీలనలకు అల్లంత దూరం ...
మొహమాటాల తోటలో విహరిస్తూ
మనఃసాక్షి మాట విననని మొరాయిస్తూ
అసలైన అంగ వైకల్యంతోనే లోకమిపుడు ....
కలిమాయల కరటక దమనకులో
ముసురుకుంటున్న కలుషిత కాలుష్యాలో
వారసత్వమనుకుంటున్న అపోహలో
పిలవని పేరంటమౌతున్న అహం బంధువో
అందరికి ఇప్పుడు కరువైన అంతర్నేత్రం ....
అసలైన నిర్వచనమంటే
అనుభవాల దూర దర్శనం....
అనంతమైన దృష్టికోణం....
అందనంత ఎత్తుల మానవత్వం
అలవోకగా అందుకోగలిగే శిఖరతత్వం....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment