Saturday, February 12, 2022

నీలి నీలి ఆకాశం తేది: 29-11-2021 శీర్షిక :పావన జీవనది ....

 నీలి నీలి ఆకాశం 

తేది: 29-11-2021
శీర్షిక :పావన జీవనది .....
కవిత సంఖ్య : 805

అదొక అందాల భరిణె 
ఆకారమెరుగని అనంతం 
రంగులెరుగని  సప్తవర్ణం 
వింతలెన్నింటికో తాను సొంతం ..... 

పంచభూతాలలో పదిలమైన 
పవిత్ర రేణువుల సమ్మిళితం 
పాలపుంతలెన్నింటినో పొదువుకున్న 
ఖగోళ రహస్యాల భాండాగారం ..... 
 
పగలంతా ప్రభాకరునితో ప్రత్యక్షమై 
ప్రాణులకాధారమైన పత్రహరితం 
నొసగి ... విశ్వ జీవకారుణ్యానికి 
ఉనికినిచ్చే పావన జీవనది ..... 

చీకటి రాత్రుల్లో వెలుగుపూలను 
ప్రదర్శిస్తూ ....నిశిరాజు జాడలు 
చూపుతూ .... కాల గమనాల గణనలకు 
నాందీ పలికిన నాడీ కేంద్రం ...... 

సాగరాల నీరు సంగ్రహిస్తూనే 
సరిజోడు మేఘమై గర్జించి 
మేలైన వర్షాలతో ... పుడమి తల్లి
మేను తాను పులకరింపజేయు ... 

అంకురములకు అండదండలై 
చేయూతల జాడలనందిస్తూ 
అవని మాతకు అచ్చమైన పచ్చల 
హారాలను అలంకరింపజేయు .... 

ఆధ్యాత్మికమున .... నీలి నీలి 
ఆకాశమన్న ....ఏడేడు లోకాలని 
ఎరుకపరిచే .... భాగవతమ్మున 
భవ్యముగా వ్యాసభగవానుడు 
మహిమాన్వితమై మన హైందవాన ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment