Friday, February 11, 2022

కలవరం తేదీ :28-11-2021 శీర్షిక : నిత్య కలకలం

  కలవరం

తేదీ :28-11-2021
శీర్షిక : నిత్య కలకలం  
కవిత సంఖ్య : 194

ప్రశాంత సంద్రపు మనసున 
పడిలేచే కెరటాలెన్నెన్నో .... 
మాట పట్టింపుల తాకిడులకే 
మసిలి కదిలే బడబాగ్నులెన్నో ..... 

చిన్న చిన్న సంగతులకే 
చిలకరింపుల ఊగిసలాటలు .... 
ఆరోగ్యాల అల్లెతాటి  సవరణలకు 
ఆలోచనల తరంగాల అతలాకుతలాలు... 

జీవితాన్ని నిలబెట్టే పరీక్షల ఫలితాలకే 
కాకుండా..... సంబంధం లేని సవాలక్ష 
సామాజిక విషయాలకు సైతం...అప్పుడప్పుడు..
సంతులనలు కోల్పోయిన సన్నాయి 
రాగాల కదలికలు ....

అధికార దాహాల అంధకారంలో 
సన్నాసుల్లా నిత్యం కొట్లాడుకునే 
కొంతమంది నాయకుల మాటలకు .... 
సై అంటే సై అనే  జాతీయ ఆటలకు .... 

తోలు సంచి లాంటి ఒంట్లోనో... 
పర్ణశాలలాంటి  ఇంట్లోనే  కాకుండా ..... 
పరిసరాల ప్రభావాలు కూడా 
పరి పరి విధాలా పరిగెత్తించి 
పడి లేచే కెరట మౌతుంది .... మనసున ... 

ఆరితేరిన ఆర్థికశాస్త్రవేత్తలం కాకపోయినా 
దడ పుట్టించే దగుల్బాజీ ద్రవ్యోల్బణాలకు .... 
సందు దొరికినప్పుడల్లా సవతి సంతానం 
సార్వ భౌమత్వానికి  సవాలు విసురుతూ ....  
సద్దుమనగని సరిహద్దుల్లోని కాల్పులకు.... 

మనసున్న మనుషులెవరికైనా 
తప్పని అంతరాయాల నిత్య కలకలం ... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment