చిన్నా భిన్నం
తేది : 24-11-2021
శీర్షిక : మన పాపమే .....
కవిత సంఖ్య : 69+13
కాల మార్పుల్లో కదలికలే
ప్రకృతి ప్రకోపాలకు కారణం ...
అగ్నికి ఆజ్యంలా ...కాలుష్యాలన్నీ
కలబడుతూ ... విర్రవీగుతూ ....
స్వచ్చ దనాలను సాంతంగా
కబంధ హస్తాల్లో బంధిస్తుంటే
కన్నంలో దూరిన నాగుపాములా
కాటేయడానికి బుసలు కొడుతుంది ......
అతివృష్టి అనావృష్టిలతో
అతలాకుతలమే జనజీవనం ....
రైతన్న జీవితాలలో దాగుడుమూతలు
మానవాళికి కూడు గుడ్డ నీడల కుస్తీలు .....
నాలుగడుగులు ముందుకెళితే
రెండడుగులు వెనక్కి లాగుతూ
అభివృద్ధిని అభిశంసిస్తూ ....
ఆటంకాల మోకాలడ్డుకోవడమే .....
మింటికి మంటికి ఏకధారలైనవేళ
రహదారులన్నీ కొట్టుకుపోయి
వంతెనలెన్నో కుప్ప కూలిపోయి
వాగులన్నీ వరసబెట్టి తీరు మార్చుకుంటూ... 9+
ఏరులన్నీ ఊళ్లలోకి పరుగెత్తి
నిలువ నీడ లేకుండా చేసి
తినడానికేమి మిగల్చక .... తిప్పలు
పెడుతుంటే .... పిల్లలు పెద్దలకు దూరమై ...
ఆడ మగ వృద్దులు కకా వికలమై
కంటిమీద కునుకు లేక ... కడుపుకింత
తిండిలేక అప్పన్న హస్తానికి
ఎదురుచూస్తూ చిన్నాభిన్నమయ్యారు ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment