అణగారిన పల్లెలెన్నో
అన్నమో రామచంద్ర అంటూ
అరిచి గీ పెడ్తున్న అన్నార్థులెంత మందో
అక్షర జ్ఞానం లేక
అక్కున చేర్చుకునే పాలకులు కరువై
ఆకలి మంటలు తీర్చుకోడానికి
ఆ తీరం దాటి అలమటిస్తున్నారు
ఒంటి చేత్తో ఒక్కడు చేస్తే
పంటికిందేసుకుని పది మంది తినేటోళ్లు
సంపాదన కడివెడు
సంసారం కుండెడు సాలేదెక్కడికి
అప్పో సప్పో చేసి కన్న తల్లి లాంటి ఉన్న ఊరు వదిలి
పనేందో తెల్వక పోయినా పయనమైతున్నరు
ఎవరో ఒక దళారికి ఎరలవుతున్నారు
ఎడారి సీమలో కుదేలవుతున్నరు
ఇరుకు ఇరుకు గదుల్లో ఇరువై ముప్పై మందితో
కిందా మీదా తంటాలు పడుతూ
మండుటెండలలో మనిషి కాన రాని ఎడారిలో
భాష రాని దేశములో బాధలు పడ్తూ.....
పూట కింత తినీ తినక కడుపు కట్టుకుని
అడ్డమీద కూలీలు కూలికెళ్లినట్టు
బిక్కు బిక్కు మంటూ నక్కి నక్కి
రోజుకో యుగంలా నరకం అనుభవిస్తూ....
చేసిన అప్పులు తీరక ముందే
కసాయి సాయబుల కబంధ హస్తాల్లో చిక్కి
తప్పుడు వీసాల తకరారుల పాలయ్యి
ఊసలు లెక్కబెడుతున్న వాళ్ళెంత మందో....
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వాళ్ళ గురించి
అప్పుడప్పుడు అచ్చయిన కథలకే
ఎడారి బతుకుల కడగండ్లకు
తడారి పోతుంది మన గొంతుల్లో
మానవత్వపు పరిమళాలు నిండి
మనుషులంతా ఒక్కటే అని గుర్తించి
మనగలిగే దళారులు ,పాలకులు రావాలి
ముందు ముందు వలసలైనా ఆగాలి
మంచి జీవితాలు మన కళ్ళ ముందే నిలిచి
మోసాలకు తావు లేని వ్యవస్థలకు స్వాగతం
అక్కడైనా, ఇక్కడైనా ........
No comments:
Post a Comment