Wednesday, July 11, 2018

రక్తమోడుతున్న రహదారులు

 రక్తమోడుతున్న రహదారులు

మనిషన్నవాడు మాయమైనాడమ్మా 
మనిషే యంత్రమై సంచరిస్తున్నాడమ్మా
మాట తీరు యంత్రం , పని తీరు యంత్రం 
ఆకలి దప్పులు నిద్ర  ఆయారాం గయారాం 
హైరానా బైరానా సర్దుబాటు సర్దుబాటు 

బంధుత్వాలు యాంత్రికం 
బాధ్యతల బందీలు యాంత్రికం 
స్వార్థాలు పెరిగి స్వారీ చేస్తున్నాయి 
పనిలో వేగం , ప్రయాణం లో వేగం 
ఆదరా బాదరా అన్నీ సర్దుబాటు 

రహదారుల నవీకరణలతో 
రవాణా సమయం కుంచించుకు పోయి 
రయ్యి రయ్యి మని నడిచే వాహనాలకు 
పైన  పైన పటారం లాగ  పటాటోపంతో 
మలుపులన్నీ మతలబులతో సర్దుకున్నాయి . 

సమయం చాలక సంయమనాలు  కోల్పోయి 
ఆకలి, దప్పులు, నిద్రలు అటకెక్కిస్తూ 
సడకుల పైకెక్కి నిద్రమత్తుల జోగుతూ
కుబుసం విడిచిన యురముం బోలి  
రుద్రభూమి వైపు అడుగులేస్తున్నారు.  

ఎత్తు పల్లముల నెరుగని జీవన యానముతో 
మత్తు మందుల క్రీనీడలలో గమ్మతుందని 
హత్తుకునే కుటుంబీకుల ప్రేమలు మరిచి 
కుత్తుకలు సైతం లెక్క చేయని యువత 
కుదేలవుతూ కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు 

అడుగడుగున ఆవురావురంటున్న  
అవినీతి, అధికార దుర్వినియోగం 
అన్ని విభాగాల్లో అడ్డదారులేర్పరిచి 
రక్తమోడే రహదారులకు 
రాచ మార్గాలేర్పరుచుచున్నారు. 

అనుక్షణం అప్రమత్తమై పౌరులు 
అన్ని విభాగాల పాలక అధికారులు 
అందులో నేను ఒక్కడిని అనుకొని 
ఆకళింపు కలిగి నడచుకుంటే  
అంతమవ్వదా కొంతవరకైనా         10-07-18

No comments:

Post a Comment