కోడి కూతలో, సుక్క పొద్దులో
మనుజులెట్లా మసులుకున్నారో
నా రాకకు ముందు అయినా
నాకంతగా తెలియదు మిత్రమా.
ఒకానొక శుభ ముహూర్తాన
ఇసుక మీద మొదలైన నా ప్రయాణం
ఇసుమంత విరామమెరుగదు.
ఇంటిల్లిపాదికి దిశా నిర్దేశాలిస్తూ
అహో రాత్రులు ఆరాటపడుతుంటా....
పల్లె నిదుర లేవడానికైనా
పాలు పితికి పట్నానికి పంపడానికైనా
రైతు పోలమెళ్లాలన్నా
రాజు రాజ్యమేలాలన్నా
పిల్లలు బడికెళ్లాలన్నా
తల్లులు తయారు చెయ్యాలన్నా
అంతా నా వైపే ఆదుర్దాగా చూస్తుంటే .... .
అందుకు నాకెంతో గమ్మత్తుగా ఉంటుంది....
బస్సుకెళ్లే బడా బాబులను
రైలు బండెక్కే రవాణా జనాలను
గగనాన తిరిగే గాలిమోటారోళ్లను
ప్రతీ క్షణం పరుగెత్తిస్తుంటా ....
ఈ మధ్యన పోటీ పరీక్షల పిల్లలకైతే
చుక్కలు చూపిస్తున్నారు.
ఒక్కటంటే ఒక్క నిమిషానికే
నా పేరు చెప్పి......
కానీ వేలకొద్దీ జీతాలు తీసుకునే
ఏ సర్కారు కోలువోళ్లకు అక్కర లేదు
ఒక్కసారి ఎన్నికైతే జీవితాంతం
ఒక్కసారి ఎన్నికైతే జీవితాంతం
పని చేయక పోయినా ప్రజల సొమ్ము తినే
ఏ నాయకునికి అక్కర లేదు .......
అయినా
షిఫ్ట్ డూటీ కార్మికున్నడుగు
దివా రాత్రాలు ఎలా పరుగెత్తిస్తానో.....
దవాఖానాలల్లో మత్తు డాక్టర్ నడుగు
ప్రతీ క్షణం ఎంత పవిత్రమో ......
108 అంబులెన్సు నడుగు
క్షణ క్షణం ఎంత ప్రాముఖ్యమో........
మందు గుండు పేల్చే సైనికున్నడుగు
నా ఆధిక్యం ఏంటో ....... .....
రాకెట్లను పంపే శాస్త్రవేత్తనడుగు
నా ప్రతి అడుగు ఎంత ప్రాధాన్యమో........
అంకెలెన్నో రకాల మార్చి
ఆకారాలెన్నో మార్చి మార్చి
రంగులు, రూపులన్నీ మార్చి
దేవుండ్లతో కలిపి విడదీసి
బొడ్లో దోపుకునే దగ్గనుండి
మణికట్టున పెట్టి , గోడ మీద వేలాడదీసి
చివరికి ఊరు వాడ లేకుండా చేసి
ఓ మూల ఇంత చోటిచ్చారు
ఒంటరిగా బిక్కు బిక్కుమంటూ
నక్కినాను ప్రతీ సెల్లులోన.... .....
అయినా నా ప్రాధాన్యత మీకు
తెలియంది కాదు.
ఎక్కడున్నా ఏమి చేసినా సదా
మీ అందరి క్షేమం కోరుతా......
No comments:
Post a Comment