అంశం : సహచరి శీర్షిక: సహధర్మచారిణి
పేరుకు నేను రాజునైనా
అచ్చమైన మంత్రిలా అందిపుచ్చుకుని
స్వచ్ఛమైన సిపాయి స్వర్ణము నా "ధనలక్ష్మి"
నా ఉన్నతికై అడుగడుగున తోడు నీడై నిలిచినది.
ప్రేమంటే ఏమిటో తెలియక పోయినా
మనువంటే మతలబేంటో కానీ
మనసున బీజం మాత్రం బాల్యం నుండే
కాలంతో బాటు కోటగోడలా నిలిచింది.
పదిలో పన్నెండులో పట్ట భధ్రతలో
ఉద్యోగాలెన్నో మారి ఊర్లన్నీ తిరుగుతున్నా
ఊతమిచ్చి ప్రతీ మైలు రాయిలో
ఊసులతో వెన్నంటి నిలిచింది.
అమ్మింటి బంధమే అయిన అపరంజి బొమ్మ
అడిగిందే తడవుగా అర్జీకి అమలు తెలిపి
మా ఇంటికొచ్చిన మహాలక్ష్మి
మమతానురాగాలకు మారుపేరు.
కలవారింటి కలికి మహాలక్ష్మి అయినా
స్వయం నిర్వహణలతో సర్దుకునేందుకు
నా పండంటి జీవితంలోకి
నడచి వచ్చిన నా ఇలవేల్పు.
ఆదిగురువై అమృత వర్షిణియై
మణి మాణిక్యాల్లాంటి పిల్లలిద్దరిని
సంఘములో సమున్నతంగా తీర్చి
తాను సైతం పట్ట భద్రత సాధించిన ప్రజ్ఞాశాలి
ఇరుగుపొరుగుతో మితభాషియై
ఇచ్ఛమైన సంబంధాలు కలిగి
ఇంటి గుట్టును ఇరుకున పెట్టక
ఇంగితమెఱిగి నడుచుకున్న ఇగురశాలి.
సదా చిరు మందహాసములతో
ఇరువైపులా మెప్పులే కాకుండా
సవ్యసాచియై వియ్యమందిన రెండు చోట్ల
విదురనీతులు ప్రదర్శిస్తూ కీలక విషయాల్లో
విడమరిచి తీర్చి దిద్దుతున్న మడమ తిప్పని ధీశాలి.
ఆపద సంపద సమయాలలో
అతలాకుతలం కాకుండా సమయ స్పూర్తితో
అనువైన మార్గాలు అన్వేషిస్తూ
బరువు బాధ్యతలను పంచుకుంటూ
భరోసా నింపి బాటలు చూపుతున్న నా కరదీపిక.
ఎంతమందికి దొరుకుతుంది ఇంత మంచి అవకాశం
ఎలుగెత్తి చాటాలని.... ఏదైనా చేసేయాలని.....
ఎన్నో సార్లనుకున్నా... ఏమిచ్చి ఋణం తీర్చుకోను ....
జీవితాంతం ప్రేమిస్తూ.....
మరుజన్మకు సైతం ఆమే నా సహధర్మచారిణిగా కోరుకుంటా....
నగునూరి రాజన్న
కరీంనగర్
(ప్రస్తుతం USA ).
No comments:
Post a Comment