వెన్నెల
పిండి ఆరబోసినంత వెలుగు
శుక్లమందు వృద్ధితో
కృష్ణమందు క్షీణిస్తూ
ఆనందాలను పంచుతున్నావు .
ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నప్పుడు
పల్లెల్లోన పంచుకున్న కమ్మనైన
నీ అందమైన అనుభవాలు
మా బాల్యపు ఆనవాళ్లు
మాకు బతుకంతా తీపి గుర్తులు
బామ్మల కథలతో
తోటి పిల్లలతో కలిసి చేసిన
సాయం భోజనాలు
పంచుకున్న సంబరాలు
పవిత్రమే ఆసాంతం
పదిలమే జీవితాంతం.
వరి కల్లంలో కాపలాలు
వరదగూడు ముచ్చట్లు
సరదాలు నింపే
నక్షత్రాల గురుతులు
మూలసుక్క, గోరుకొయ్యలు,
పిల్లలకోడి, తెల్లవారి చుక్క
పల్లె మిత్రులతో పంచుకున్న
పసందైన విచిత్రాలు .....
అప్పుడైనా ఇప్పుడైనా
నీ ఉనికిలో తేడాలేదు.
మా జీవితాలే మారిపోయాయి
బరువు బాధ్యతలు పెరిగి
బాదర బందీలలో బందీలమయ్యాము.
చదువులు, ఉద్యోగాలు,
ఉరుకులు పరుగులు
పిల్లలు, పెంపకం, వాళ్ళ చదువులు
ఇల్లు, వాకిళ్లు, బంధువులు
ప్రయాణాలు,పెళ్లిళ్లు, పేరంటాలు,
వాళ్ళ పిల్లలు, అమ్మా నాన్నలు
అందరి ఆరోగ్యాల సమీక్షలు.
జీవితంలో మిత్రులతో
మంచివి, చెడ్డవి
అవసరం ఉన్నవి, లేనివి
మోసాలు, ద్వేషాలు,
తెల్లవారితే ఏమవుతుందో
తెలియకుండా బ్రతికేస్తూ
బ్రతుకులు వెళ్లదీస్తూ ....
జిలుగు వెలుగుల కరెంటు చీకటులలో
పట్టణాల బ్రతుకులతో పావురాల గూళ్ళలో
తిరిగి చూసుకునే లోపు ఒక జీవిత కాలం.
ఆనాటి ఆనందాలను
అపురూప దృశ్యాలను
ఆవిష్కరించుకుని
ఆత్మ సంతృప్తిగా
మననం చేసుకునే
మంచి అవకాశమిచ్చిన
కవి మిత్రులను
అభినందిస్తూ .....
No comments:
Post a Comment