Monday, July 30, 2018

మా జిల్లా కరీంనగర్

మా జిల్లా కరీంనగర్

శాతవాహనుల రాజ్య ముఖద్వారం 
చారిత్రికతకు  నిలువెత్తు సాక్ష్యం 
కోటిలింగాల ముక్కంటి నిలిచిన నేల 
     
రామగిరి, ఎలగందుల, నగునూరు కోటలు 
నాడు మహారాజులు ఏలిన ఆనవాలు 
చారిత్రక కట్టడాల చలువ కలిగిన నేల 
    
నల్ల బంగారమే  వెల్లి విరియంగా 
నలు చెరగుల దక్షిణ భారతమంతా
జిలుగు వెలుగులు రేఖలు నింపిన నేల 
    
సిరులు కురిపించు మానేరుడామ్ తో   
పచ్చ తివాచీలు పరచి పరవశించు
చిన్మయానందములు పంచు రైతన్నకు 

దక్షిణ గంగగా ప్రసిద్ధి పొందిన 
దండి గోదారమ్మను దర్శించగానే  
సర్వ పాపాలను హరియించు నేల 

దక్షిణ కాశీగా ఖ్యాతి గాంచిన  వేములవాడ
సాహిత్య సౌరభం భీమ కవి నడయాడిన 
శ్రీ రాజరాజేశ్వర స్వామి వెలసిన నేల 
     
దక్షిణ వాహినిగా వాసి గాంచిన గోదావరి ఒడ్డున  
శ్రీ లక్ష్మీ నరసింహుని క్షేత్రం ధర్మపురి 
దర్శిస్తే  యమపురికేగరన్న నమ్మకం ఈ నేల 
     
గౌతముడు తపమొనరించుకుని 
గోదారి తీరాన గౌతమేశ్వరున్ని ప్రతిష్టించిన 
పవిత్ర మంత్రపురం వెలసింది  ఈ నేల  

కొత్తకొండ వీరభద్రుడు,కొండగట్టు అంజన్న 
కొత్తగట్టు మత్స్యగిరీంద్రుడు,కాళేశ్వర ముక్తేశ్వరులతో
ఆధ్యాత్మికతలకు ఆలవాలము ఈ నేల 
      
ఇల్లంతకుంట సీతా రామచంద్రులు, 
సుందిళ్ల లక్ష్మీనరసింహుడు 
అత్యంత పురాతన ఆలయాలు  
కాకతీయుల కట్టడాలతో కళ తేలిన ఈ నేల 
      
సుందరమైన వెండి నగిషీలతో
ప్రపంచాన ప్రసిద్ధి గాంచిన  
సున్నితమైన సుతారమైన 
సిల్వర్ ఫిలిగ్రీ కళకు నెలవు ఈ నేల  
       
తెలుగు భాషను దిగంతాలకు చేర్చిన  
పలు భాషల సకల సాహిత్య సామ్రాట్టు 
జ్ఞానపీఠ అవార్డు గ్రహీత 
విశ్వంభరుడు సి నా రె గారు పుట్టినూరు ఈ నేల 

స్వార్థమెరుగని సచ్చీలుడు పలు భాషల పరిణతుడు 
బలము లేకున్నా బలగాన్ని  కలుపుకుని
పూర్తి కాల పాలన సాగించిన అపర చాణుక్యడు
అత్యంత ఆర్థిక క్లిష్ట పరిస్థితులను అధిగమించ 
స్వేచ్చా విశ్వ వాణిజ్యానికి తలుపులు తెరచిన ధీశాలి
పాములపర్తి వేంకట నర్సింహుడు నడయాడిన భూమి.....
       
ఉద్యమాల పురిటిగడ్డ ఉనికి నిలిపి 
ఉర్రూతలూగించి సకల జనులతో 
తెలంగాణకు ఊపిరి పోసినది ఈ నేల 
      
అతివృష్టి, అనావృష్టి ఆనవాళ్లు అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టినా  
సమ శీతోష్ణస్థితులతో సన్నుతించి  
అన్నపూర్ణకు ఆలవాలమైనది  ఈ నేల 
మము కన్న తల్లి మా జిల్లా కరీంనగర్ నేల....

నగునూరి రాజన్న
కరీంనగర్ 

No comments:

Post a Comment