అంశము: పల్లె మట్టి పాట
23-09-2020
శీర్షిక: జ్ఞాపకాల పోపుల పెట్టె....
సంఖ్య: 523
పల్లె మూలాలు పదిలమైన ఇల్లే
పవిత్రమైన నా జన్మస్థలం
పనిగట్టుకుని ప్రత్యేకంగా
పొలం పనులు చేయకపోయినా....
అరికాలుకు మట్టి అంటనీయమంటూ
అమ్మానాన్నలు మాకోసం ఆరాటపడినా
ఆటకోయిలలమై మేము అప్పుడప్పుడు
అన్ని పనుల ప్రవేశాలు పాసయినోళ్ళమే ...
ఇడుగు ఇరువాలు పెడుతుంటే
ఇష్టంగా దూరిపోయి వెంటపడి
ఇగురంగా పొలం దున్నుడు నేర్చుకుని
తరి ఖుష్కి భూముల్లో తండ్లాడినోళ్ళమే...
అలసిన మనుషులకు సొలసిన మనసులకు
అంకురమే మన పల్లె మట్టి పాటలు
ఆటపాటలే అలుపులు తీర్చి
అందించును కొత్త ఉత్సాహం ....
యాతములో మోతలేసిన
“హైలెస్సా హైలెస్సాలు” కూడా
పని యాతనలు మైమరిపించి
పరుగెత్తించు పనిలో హుషారుగా...
గూడ వేసే జోడు శ్రామికులు
పలికే “ఉస్సు ఉస్సులు “ సైతం
ఊరటనిచ్చి హుషారొచ్చును
పనిభారం పెను భారం కాకుండా ....
వరినాటు వరసల్లో వయ్యారి పదములు
వనితల గొంతులో ఊపిరౌ కమ్మన్ని పాటలు
గొంతెత్తి పాడేరు జనపదం రసరమ్య రాగమై
రంజింప జేసేరు జనహృదయం కొల్లగొట్టి....
బతుకు దెరువు బాటలో బైలెల్లినంక
బంధువునై పోయాను నేను గూడా
అమ్మా నాన్నలు అమరులయ్యాక
ఆమాత్రం కూడా ఆణిముత్యపు
జ్ఞాపకాల పోపుల పెట్టె అయింది ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment