అంశము: నిశ్శబ్ద చిత్రాలు
తేది: 08-10-2020
శీర్షిక: ప్రకృతి..మనిషి
సంఖ్య: 535
రవి చేరువతో విరియు కమలం
శశి చూపులతో కదులు కలువ
నిశి జాడలతో విశ్రమించు విశ్వం
అన్నీ అలవోకగా అమరిపోయిన
అందమైన అనుభూతుల నిశ్శబ్ద చిత్రాలే .....
ప్రకృతిలో పల్లవించి ప్రతిబింబంచే
ప్రతి క్షణం.. పలు చిత్రాల సమాహారమే
కాలగమనంలో కదిలిపోతున్న కమ్మని
మధుర స్మృతులై నిలిచే నిశ్శబ్ద చిత్రాలు ...
విశ్వ కాన్వాసుపై విరాటుడు
విధిలీలన విడిచే వింత వింత
పరిస్థితులన్నీ చిత్ర విచిత్రాలై
పరుచుకునే నిశ్శబ్ద చిత్రాలే సుమా!
పల్లవించడం ప్రకృతియందేనా
ఎందులో తక్కువంటూ ఎదిగిన
ఎదురులేని మనిషి నంటూ
అన్నింటా పోటీ పోతున్నాడు కదా !
కోకొల్లలు ఉండనే ఉన్నవి కదా
కళ్ల ముందు కదిలే నిత్య సత్యాలు
సమకాలీన మనమే ప్రత్యక్ష సాక్షులం
సవాలక్ష సంఘటనల తారా తోరణం...
ఎప్పటికో కాని ఎరుకపడని మరకలు
మచ్చుకైనా రవంత మాత్రం శబ్దమెరుగని
మారాజుల మహిమాన్వితములు
మహా మహా ఘటిక కుంభకోణాలు....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment