అంశము: గేయము
18-09-2020
శీర్షిక: ఏం గొప్ప నీవని....
సంఖ్య: 520
ఏం గొప్ప నీవని ఎదురొచ్చి నిలవాలి
మానవా! అవని నీకు నూరేండ్లు తోడుగా !
చెట్టు చేమ నీకు తోబుట్టులై కడుపు
నింపగా...కళ్ళళ్ళ పెట్టుకుని చూడగా
నిప్పు నీరూ నీకూ చేదోడు వాదోడూ
జీవితాంతం నిన్ను కనిపెట్టుకోగా
// ఏం //
అంబరం గొడుగయ్యి ఆదరించేను
సంద్రములు నీకయ్యి తోడు నిలిచేను
సూర్యమా నిను తట్టి నిద్ర లేపేను
చంద్రమా నీ కొరకు జోల పాడేను
// ఏం //
కొండ కోనలు దండి దాపుగ నిలువ
నదులన్నీ నడిచొచ్చి దాహాలు తీర్చంగ
పశువులు పక్షులు నీ పక్షమే చేరంగ
ప్రాణ కోటిలో నీకు అధిపత్య మీయంగా
// ఏం //
సాటి మనిషిని కూడ సన్నుతించని నీకు
సర్వ సంపదల నొసిగి స్వాగతించేను
ప్రకృతి పదనిసల పాలించు తల్లీ
పాడి పంటలనిచ్చి పోషించు నిన్ను
// ఏం //
పానముండగనె నీవు పరితపించూ..
ప్రకృతి పట్ల బాధ్యతలు కలిగి
ప్రతి రోజు..ప్రతి పూట.. ఓ మిత్రమా
సాటి మనిషికి నీవు సాక్షిగా నిలువుమా
// ఏం //
No comments:
Post a Comment