రిటర్న్ గిఫ్ట్
తేది: 18-09-2020
శీర్షిక: వాయనం
సంఖ్య : 519
మంచి చెడుల మతలబులలో
ఒంటరి వారెవరూ కాదంటూ
తోడు నీడగ మేమున్నామంటూ
ఆత్మీయంగా చెయ్యేసి అండగా నిలిచి
చాటుకునే సమిష్టి తత్వ సందర్శనం
మన సాంప్రదాయాల మర్మం...నాడు
కట్నాలు కానుకలు సమిష్టి తత్వమైతే
తిరుగు కానుకలు కృతజ్ఞతాభావం
కానుకయినా తిరుగు కానుకయినా
భక్తి మీరగ ప్రేమలు పంచుకునే జ్ఞాపికలే....
తృణమైనా ఫణమైనా సరే కానీ
బంధు మిత్ర సపరివార గణాలలో
పేరేదైనా పెన్నిధిగా తాంబూలమో
ఫలమో...ఇస్తినమ్మ వాయనం అంటే
పుచ్చుకుంటినమ్మ వాయనం.... నేడు
రాను రాను రాగాలాపన గాడి తప్పి
పురాణాల విశదీకరణాలలా బంగారమో
బంకమట్టిదో...అన్న చందంగా
రాజుగారిని అనుకరిస్తూ రాగాలు వల్లిస్తూ
ఎత్తుకుని...ఎత్తుకోలేక ఎగాదిగా చూసి
సత్తుదో సమకాలీన పాలిమర్లదో ఇస్తుంటే...
అపురూపంగా ఇంట్లో ఉంచుకోలేము
అయిష్టంగా బయట పారేయలేము....
మన రిటర్న్ గిఫ్ట్ లేమోగాని మనం
ప్రకృతికిచ్చే పనికిరాని గిఫ్ట్ లైపోతున్నాయి....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment