ఓ పౌరునిగా అడుగుతున్న
ఓ పౌర నాయకా
ఓటు వేయమన్నప్పుడు ప్రజలను
ఓ దేవునిగా కొలుస్తావు, ఓపిగ్గా ప్రాధేయపడ్తావు
ఒడిదుడుకుల ప్రజా జీవితాలకు
ఓ మార్గం చూపమన్నప్పుడు మాత్రం
ఓడ దాటిన బోడ మల్లయ్యనంటావు
ఒకటి కాదు రెండు కాదు అన్నింటా
అలుగులై పారుచుండె, రాజ్యమేలుచుండె
అవినీతి, బంధు ప్రీతీ,లంచగొండితనం
అవిటి వాడి ముందు అరణ్య రోదన వలె
అక్కరకు రాని చుట్టం,మొక్కిన వరమీయని దైవమోలె
అమ్మతనం మొదలయ్యే ప్రసూతి ఆసుపత్రులు మొదలు
ఆఖరు మజిలీ శవ పేటికల వరకు అనంతమగుచుండె
అత్యంత ప్రజావసరాలైన విద్య,వైద్యం,రోడ్లు,రక్షణ,న్యా యం
అంచెలంచలుగా ప్రైవేటు పరం చేస్తున్నారు
అరవై కాదు డెబ్భై ఏళ్ళు దాటింది స్వాతంత్య్రం వచ్చి
అణు మాత్రం మారడం లేదు ఏ విధానం కూడా
అర్ధణా కోడిగుడ్డుకో, అర భాగం బ్రెడ్డు ముక్కకో
అరకొర దొంగతనాలకు అరదండాలేసె అధికారగణం
అమాత్యుల కోట్ల దాణా కుంభ కోణాలకేమో
అయిదు లక్షల అపరాధ రుసుము, మూడేండ్లు జైలు శిక్షతో
అయిందనిపించారు, చేతులు దులుపుకున్నారు.
రేషనలైజేషన్, లిబరలైజేషన్,గ్లోబలైజేషన్,
డిజిటలైజేషన్.... ఎన్ని జనరేషన్స్ మారినా
ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది
అయ్యేస్సులు సైతం అమలు చెయ్యట్లేదు
అనుకున్న పని విధానాలు ఆలయాలలో కూడా
అక్షరలక్షలు కాదు , కోట్లివ్వక్కర్లేదు సర్వజనావళికి
అందుబాటులో ఉండే సలక్షణమైన అక్షర జ్ఞానం చాలు
అఖండ విశ్వములో తమను తాము నిలబెట్టుకోడానికి.
No comments:
Post a Comment