అక్షరాలు అమర్చి పదాలు పేర్చి మాంత్రికంగా
వాక్యాలు కూర్చి కవితలు అల్లుతూనే ఉన్నాను
కంటికి కనిపించిన కమామీషులు కావొచ్చు
చెవులకు వినిపించిన సంఘటనలే కావొచ్చు
మనసుకు నచ్చిన మతలబులే కావొచ్చు
చికాకు కలిగించిన చిక్కు ముడులూ కావొచ్చు
కొన్నిసార్లు ఆరాటమే ఎక్కువవుతుంది
అందంగా అలంకరించి పండించలేక
ఆప్యాయంగా అవ్విష్కరించలేకపోవచ్చు
అయినా తాపత్రయ పడుతూనే ఉంటాను
స్వయంగా చూచిందైనా, సాంతం తెలిసిందైనా
చీకటి గదిలో లేని నల్ల పిల్లికై వెదికిన చందంగా
మంద గమనముతో మలి అడుగు కదలక పోవచ్చు
అయినా ఆపసోపాలు పడుతూనే ఉంటాను
ఆరంభ శూరంగా అలవోకగా సాగించినా
అల్లి బిల్లి ఆలోచనల సవ్వడులతో అలసి
రోజులు గడిచినా గమ్యం కాన రాక పోవచ్చు
అయినా ఆరాట పడుతూనే ఉంటాను
అలవోకగా అందంగా మలచలేని శిల్పమైనా
మనకెందుకులే అని మౌనంగా మిన్నకుండక
మనసు మదనపడీ మందగమనంతో ముందుకు రాక పోయినా
మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటాను
ఏకరువుగ లెక్కించగలిగిన ఎరుక సంఘటలైనా
ఊపిరాడక ఉసూరుమన్న ఊసులు కూడా కొన్నిసార్లు
మనసుకు రెక్కలొచ్చి మరోలోకంలో విహరిస్తూ
అరక్షణంలో అందంగా అమరిపోతుంది.
అలౌకికమైన ఊహలను అపురూపంగా ఒడిసిపట్టి
అనంత విశ్వంలో అందమైనదిగా మలచాలని
ఉన్నఫలంగా ఉరకలు పెట్టించి ఉత్సాహం నింపాలని
తదేకమయిన తపనతో తంటాలు పడుతూనే ఉంటాను
ఓ గమ్యం ఓ గమనం ఓ ప్రయోజనం
ఓ మెరుపు ఓ చరుపు ఓ విరుపు
ఔచిత్యమైన వివిధ పదబంధాలు
అనుభూతికి లోనయ్యే మానవీయకోణం... దొరికేది
జన బాహుల్యపు సామ్యమైన అలంకృతం
క్లుప్తత గుప్తత సంక్షిప్తత పరిణతితో
సమస్య ఆవిష్కార ప్రస్తావన భావ గణన
సరదాగా చదివించే అందమైన శిల్పం... ఇలా...
మంచో చెడో మనకు నచ్చితేనే కదా...
మన మనసు కుదుటపడితేనే సుమా....
ఇంపుగా సొంపుగా జనంలో రంజిల్లేది
ఆ తర్వాతనే......బస్తీమే సవాల్.....
హంస వాహిని బాసర వాసిని భావానికి బానిసనై
అంతర్మథనముతో ఆర్తిగా అవలోకించుకుని
ప్రతి కవితను పదే పదే పునశ్చరణ గావించుకుని
సమున్నత హిమ శిఖర సమంగా తీర్చి దిద్దుతూ
సదా తన్మయత్వం పొందుతూంటాను
No comments:
Post a Comment