అసలైన అవిటి తనం
కళ్ళు లేని కబోదులైనా సరే ఈనాడు
కళ్ళే అక్కర లేని బ్రెయిలీ తో కదులుతూ
కడ దాకా పయనించి గమ్యం చేరుదామనుకుంటున్నారు.
కళ్ళున్న కోట్ల మందికి మేము తీసి పోమంటుంటే ,
కళ్లుండి "కంచే చేను మేసినట్టు" చేస్తున్నారు కొందరు.
మాటలు రాని మూగవారు సైతం
మతలబులన్నీ చేరవేసుకుంటూ
మనుషుల అంతరంగాలను సృశిస్తున్నారు.
మనసున్న మారాజులుగా వీరు మసులుకుంటుంటే,
మనసు లేని రాయిగా "మాకేంటి " అంటున్నారు కొందరు.
చిన్నశబ్దమైన వినలేని చెవిటివారు అయినప్పటికీ
పెదాల కదలికలతో పదాల కూర్పులను
మదారవిందముగా ఆకళింపు చేసుకుంటున్నారు.
సుతార సంద్రంగా కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంటే,
సతాయిస్తూ "శాడిజం" చూపిస్తున్ నారు కొందరు .
శరీరమంతా స్వాంతన లేక అల్లాడుతూ కూడా
నిర్వీర్యం నొందక, తదేక తపనలు సాగిస్తూ
తమకు తాము నిలబెట్టుకోవాలని చూస్తున్నారు.
తనవారికి ఏకోశానా భారం కాకూడదని తలుస్తుంటుంటే,
అవతలి నుండి "అమ్యామ్యాలు " ఆశిస్తున్నారు కొందరు.
కాళ్ళు , చేతులు లేని వారైనా ఈనాడు
కలో, గంజో కడుపులోకి చేర్చుకోవడానికి
కష్టాన్నే నమ్ముకుని ఇష్టంగా పని చేస్తున్నారు.
స్వయంకృషిని మించింది లేదని నిరూపిస్తుంటుంటే,
ఇష్టారాజ్యంగా కొందరు "దక్షిణ"లకు అర్రులు చాస్తున్నారు.
మానసికంగా పరి పక్వత లేనివాళ్ళు సైతం
మళ్ళీ మళ్ళీ ప్రశిక్షణలతో చేతల పనులు వెదుక్కొని
కొసిరి కొసిరి చేస్తూ ఆలంబనల ఊపిరులూదుతున్నారు.
మనోవైకల్యం జయించాలని మారామం చేస్తుంటుంటే,
వింత మానసికతతో "అవినీతి" ని ఆదరిస్తున్నారు కొందరు.
మురుగుజ్జులు సైతం
మరో ప్రపంచం సృష్టించుకుని
వింత చేష్టలతో కొంత ఊరడిల్లుతున్నారు.
ఎంతో ఎదుగుదల, పరిణతులను చూపిస్తుంటే,
అన్నీ మరిచి "అపర మురుగుజ్జు"గా అవతరిస్తున్నారు కొందరు.
వారు వీరు అనే తేడాలే లేవు
అక్కడా ఇక్కడా అనే అంతరాలే లేవు
పౌరపాలికల నుండి పార్లమెంటు వరకు
జనన, మరణాలు మొదలు జమాబందీల వరకు
ఎందెందు వెదికినా అందందే కలదు అలసత్వం
జీతాలెన్ని పెరిగినా "గీతానికి" సెలవు లేదు.
యుగ యుగాలుగా వేదభూమిగా వెలుగొంది
విశ్వ మానవాళికే మార్గదర్శకమైన భారతావని
రోజు రోజుకు పెరిగిపోతున్న అవినీతి భూతం,
లంచగొండి కాలుష్యములు, ఆవురావురుమంటూ అర్రులు చాస్తూ...
అర్థాకలితో అలమటిస్తున్న కోట్ల జనాలను కొల్లగొడ్తూ,
ఉసురు పోసుకుని, ఊపిరులు ఊదేస్తూ
నివురు గప్పిన నిప్పులా, జడలు విరబోసుకుని,
కరాళ నృత్యం కావిస్తూ, మరు భూములను తలపిస్తూ ....
ప్రతి ప్రభుత్వ పనికి పరోక్ష ధరలను నిర్ణయిస్తూ,
గడీల దొర తనమోలె, బడా బాబులకు మాత్రమే అందుబాటై
చడీ చప్పుడు కాకుండా కోట్ల టర్నోవర్ కు చోటు కల్పిస్తూ,
విచ్చలవిడి తనముతో, ఉచ్చ నీచములు మరిచే తెరలు తీస్తున్నది.
విశ్వ అవినీతి లంచ గణాంకాలలో
మొట్ట మొదటగా నిలువడానికి
ఉరుకుల పరుగులు తీస్తున్నది.
ఇంకెంతో దూరములో లేము.
భారతీయుడా మేలుకో భవిష్యత్తును సరిదిద్దుకో.
నేటి నుండే మొదలుపెట్టు
నీతి నియమాలు కనిపెట్టు
పట్టుదల,క్రమశిక్షణలు చేపట్టు.
No comments:
Post a Comment