Tuesday, June 5, 2018

పరిచయం అక్కర లేని పదార్థం

కనిపెట్టిందెవరో కానీ కనికట్టే చేసింది 
కట్టగట్టి ప్రపంచాన్ని కబలిస్తున్నది 
కమనీయపు రంగులలో కలుపుగోలుగా  
కడు రకాల వస్తువులుగా అందుబాటైనాయి 
    
పల్లె పట్నం తేడా లేకుండా
పాదాలనుండి శిరస్సు వరకు
పళ్ళుతోమే పుల్ల నుండి కళ్ళ లెన్స్ లు
పాదరక్షలనుండి దువ్వెనల వరకు 

స్వచ్ఛమైన పాల నుండి మొదలుకుని 
సరసమైన వంట సరుకుల సంరక్షణకై 
పరుచుకుని నిదురించే చాపలనుండి
పంటలకవసరమయ్యే సంచులవరకు

అది ఇది అనే అంతరమే లేదు 
అందరికీ అందుబాటులో ఉంటాయి 
ఆడా , మగ ,పిల్లా పాప, ముసలి ముతక 
ఆట వస్తువుల నుండి అంతరిక్ష నౌక వరకు  

ప్రతి పనిలో ఉపకరణాలుగానే కాకుండా
పాయసాల పానీయాల వడ్డనాలలో
పండగల పబ్బాల పందిల్లలో
పెళ్ళి భోజనాలకు “విస్తరి”ంచింది  

వందలేండ్లయినా వదలని ఆయుష్షు కలిగి 
వయ్యారాలు పోతూ వణుకు పుట్టిస్తున్నది 
జీవం లేనిదైనా జీవరాశికి సవాలుగా నిలిచి 
జన జీవనాన్ని అతలా కుతలం చేస్తున్నది  

ప్రకృతినుండే ప్రాణప్రతిష్ట గావించుకున్నా 
పంచభూతాలలో కలిపితే మాత్రం
ప్రచండ ప్రద్యూషణాల కారకమౌతుంది
ప్రపంచాన్నే గడ గడలాడిస్తుంది 

పాలకులకు పట్టించుకునే సమయం లేదు 
ప్రజలు  అధికారులు ఆలోచించడం మానేసారు 
ప్లాస్టిక్కు , పాలిథీన్లకు  ప్రత్యామ్నాయాలు  పరిశోధించాలి 
విశ్వ రక్షణకై  వినూతనంగా  వైజ్ఞానికులు ఇకనైనా.  

No comments:

Post a Comment