అంతరాత్మతో సంభాషణ
తేది : 14-08-2024
శీర్షిక : అప్పుడప్పుడు ....
సహస్రాధికం
ఎప్పుడూ తోడునీడ గానే ఉంటానా
అన్నీ నీసమ్మతంతోనే చేస్తున్నా నా....
ఎందుకో అప్పుడప్పుడు నిన్ను
మరిచిపోతున్నాననిపిస్తున్నది .. ..
ప్రశ్నించుకుంటే....అనుకోకుండా నే
చాలా విషయాలు నీవు చెబితే చేసినట్టుగానే
చేసేసినా...అహం తట్టి లేపినప్పుడో...
అలక పలకరించినప్పుడో ...కోపంతో
మూతి ముడుచుకున్నప్పుడో....బంధు
బలగంలోనో మిత్రబంధంలోనో పక్షపాతం
నెత్తికెత్తుకున్నప్పుడు మాత్రం
మనసెందుకో ససేమిరా అంటుంది...
చాలా సార్లు అవలోకించుకోవాలి
లోలోపలికి తొంగి చూసుకోవాలి
అని చుట్టూ పదుగురికి కట్టుదిట్టంగా
బోధించినా....నావరకు వచ్చేసరికి మాత్రం ...
న కారమునకు ఓటేసి
మారాము చేస్తుంది మనసు ....
నాలుగుకాలాలు నలుగురిలో
ఉదాహరింపబడే ఉదారత్వం
పొదువుకుని జిలుగు వెలుగులు
విరజిమ్మాలనుకుంటాను...కానీ
ఎందుకో అప్పుడప్పుడు చీకటి
చేతికి చిక్కిపోతున్నాను ...
సెలయేటి చెలిమె నీటిలా చల్లగా
తీయగా పానకమై అందరి దాహార్తిని
తీర్చేద్దామనుకుంటానా....ఎందుకో
అంతలోనే కటిక చేదు రుచితో
కలుషితమై కాసారమౌతున్నాను ....
నలుగురిలో ఒకరిగా నేను
కలిసిపోవాలనుకుంటాను...
కానీ ఊరంతా ఒకదారైతే ఉలిపి
కట్టేదొకదారిలా అప్పుడప్పుడు
తెలియకుండానే ఒంటరినై
తదుపరి కుములిపోతాను ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment