Tuesday, March 19, 2024

ఏరు దాటగానే తెప్ప తగలేయడం ... తేది : 28-03-2023 శీర్షిక : గుదిబండలు

 ఏరు దాటగానే తెప్ప తగలేయడం ... 

తేది : 28-03-2023
శీర్షిక : గుదిబండలు  ... 

వొళ్ళు వంచం  చమట కార్చం 
నోటిమాటలతో అత్తరు పరిమళాలు 
వెదజల్లి ... బుట్టలో వేసుకోవడమే ... 
ఎదుటివారి కష్టార్జితానికి ఎసరు పెట్టడమే ... 

అవసరానికి మించిన అణకువలు 
అడగకముందే అన్నీ అమర్చడాలు 
పంటితోనైనా సరే కాలులో ముళ్ళు 
తీయడానికి పూనుకున్నంత పురాణం ... 

పీచు బంధుత్వాల వావి వరుసలు 
అతివినయపు పిలుపులు .... 
తెచ్చిపెట్టుకున్న ఆప్యాయతలు 
తెలిసిపోయే విధమైన నాటకరక్తి 

వేలెడు సందుకోసం వెంపర్లాడి 
కాలు పెట్టి మన ఖర్మ ఫలాలను 
తస్కరించగలిగే నైపుణ్యం .... 
నోటిలో నాలుకలా మెదలడం ... 

కల్పితాల కబుర్లు చెప్పి కడుపులు 
నింపడం ... అసందర్భపు కితకితలతో 
ఆశ్చర్యాలను నటించడం .... అవ్వా అయ్యా 
అంటూనే అసలు ముల్లె మాయం చేయడం .... 

సుక్క ముక్కలు నీకిచ్చి  వెర్రోన్ని జేసి 
వేలకోట్లు వెనకేసుకునే కొంతమంది రాబందులు .... 
నాలుగొద్దులు కూలి పైసలిచ్చుకుంటూ 
ఐదేండ్లు రాజ్యమేలే అసుర సంతానం ... 

ఛీ కొడుతున్నా సరే ... చీపురు పట్టుకునైనా సరే 
చక్కిలి గింతలు  చేసి నీ మనసు దోచుకుని  
నెల రోజుల కితకితలు  చేసైనా సరే 
ఐదేండ్లు మీదెక్కే కొన్ని ఐరావతాలు .... 
ప్రజల ప్రాణాలకు గుదిబండలు .... 

No comments:

Post a Comment