వెంటాడే ఇల్లు
తేది :23-03-2023
శీర్షిక : పుణ్య సౌధం
సంఖ్య : సహస్రాధికం
పుట్టి పెరిగిన పుణ్యపు పూలవనం
నిట్టాడులా నిలబడి మమ్మల్ని
జీవితాంతం కంటికి రెప్పలా
కనిపెట్టుకున్న కమ్మని పొదరిల్లు ....
తాతయ్య తండ్లాటలతో
ముప్పాదారు ఎడ్లబండ్లలో
మూడు రోజులు పయనమై
మహాదేవాపూర్ నుండి తెచ్చిన
దేవదారు కలప సాక్ష్యం ....
ఆశలన్నీ తీర్చుకుని ఆశయాలకు
అనుకూలంగా శంఖు చక్రాలతో నిత్యం
పూజలందుకున్న నిలువెత్తు
పెద్ద దర్వాజ శ్రీ మహాలక్ష్మి నిలయంగా ....
అడుగులు వేయడం నేర్చుకుని
అలుపులు తీర్చుకుని... మేను
వాల్చుకుని ... మెరుగులు దిద్దుకుంటే
సంఘంలో గౌరవాలను కట్టబెట్టిన
గారాల గూడు ....
ఆట పాటలలో అన్యోన్యంగా
దోస్తులతో దాగుడు మూతలకు
మూల మూలాల దాక్కున్న
జ్ఞాపకాలు నిండిన దొంతరలు ....
నాన్నగారి తదుపరి అమ్మగారి
అబ్దికాల వరకు గొడుగులా
నీడనిచ్చి మమ్మల్ని కాపాడి
బ్రోచిన దేవాలయం ....
మర్కటముల మారములతో
శిథిలమై జీర్ణమై ... నిరంతరం
కలలలో కదలాడుతూ నన్ను
వెంటాడుతున్న పుణ్య సౌధం ...
No comments:
Post a Comment