Thursday, September 12, 2019

నీటి మీది రాతలు

నగునూరి రాజన్న
అంశం - నీటి మీది రాతలు
తేదీ 12-09-2019
శీర్షిక - కొందరికి  కొట్టిన పిండి !
సంఖ్య - 286

అడిగినదే తడవుగా అన్నీ ఒప్పుకోవడం
అడగక పోయినా అదనంగా చేస్తామనడం
ఆలోచిస్తే అందరికి సాధ్యం కానిది అనుకుంటాం...కానీ
అడుగు మార్చగానే  మాట మార్చడం ....

అదెంత పని అలా చూస్తూండు
అరక్షణంలో చేసేస్తానంటూ హామీలు  ....
ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవడమే .... కానీ
ఏండ్లయినా ఎక్కడేసిన గొంగళి అక్కడే.....

అదను చూసి తీయని ముచ్చట్లు
అందరు తెలుసంటూ భరోసాలు
అయిపోతుంది నీ పనంటూ నమ్మకాలు
నమ్మి నానబోసుకుంటే... పుచ్చి బూరలే  ....

అసలు వాక్యానికి అతికే వారసులు
సర్వ శ్రేష్టమయిన సమున్నత సంకేతం
వారిని వదిలి వల్లె వేసుకుంటే
పూర్ణ కుంభం లేని ఆహ్వానమే ....

మైకులు పెట్టి బాకాలూదే నకిలీ శాంతి కపోతాలు
ప్రతి అర్ధ దశాబ్దానికోమారు  పారా హుషారు...
అందమైన పద పొందికల మేనిఫెస్టోల్లో వాగ్దానాలను
బంధించి ఆకర్షించగలరు ఓటరు నాడీ......

అడుగడుగున ప్రశ్నించే ఆత్మసాక్షిని చంపుకుని
మనసును అణగద్రొక్కి... గుండె పిండే మనో నిబ్బరం
ప్రదర్శిస్తూ బ్రతకటం మామూలు మాట కాదు !
అందరికి సాధ్యం కాదు .... కొందరికి మాత్రమే  కొట్టిన పిండి !

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)


No comments:

Post a Comment