అద్దె ఒడి....... భావి జీవితాన చీకటికోణం
మత్తు మందుల కలల క్రీనీడలలో
గమ్మత్తు ఉందనే గజి బిజి ఆలోచనలతో
సోంబేరి యువత పెడదారిన పడుతూ, దేశ
భావి పునాదులకు బీటలు వేస్తున్నారు
ఆరి తేరిన కర్కశ చోర కలలతో
అమ్మా నాన్నల ఆలనలో ఉండాల్సిన
అభం శుభం తెలియని పసి కూనలను
అలవోకగా ఎత్తుకెళ్ళి అమానవీయతకు పాల్పడుచున్నారు
అద్దెకిచ్చిన అమ్మ ఒడిలో
మత్తు మందులతో జోల పుచ్చుతూ
ఆ బాల్యాన్ని బందీమయం చేస్తూ
మానవతను మంట కలిపి జోలె చాపుతున్నారు
అడ్రస్ లేని ఆలసీ సోంబేరులు
అగణిత సంచార క్రూర నర జాతులు
అక్కున చేర్చుకుంటున్నారని అంచనా
అనులోమాను పాతమై అభివృద్ధి చెందుచున్నది
అద్దె ఒడిలో అమూల్యమైన బాల్యం
రంగులు మార్చే రాజకీయాలు కాకుండా
లంచాలకు చిరునామాగా మారే గణాలు కాకుండా
సదన సౌకర్యాలు సమృద్ధిగా సమకూర్చు కుంటూ
సంకర మానవ రాక్షసులకు అడ్డుకట్ట వేస్తేనే
స్వర్ణ భారతిని సాదరముగా అందించవచ్చు
భావి భారత పౌరుల బంగారు భవిష్యత్ ను
చిందర వందర చేస్తూ
స్వార్థానికి చిరునామా గావిస్తున్న
చీకటి కోణాన్ని కూకటి వేళ్ళతో కబళించాల్సిందే......
నగునూరి రాజన్న
నగునూరి రాజన్న
No comments:
Post a Comment