అన్నిటికీ మూలం…
తేది : 11-11-2021
శీర్షిక : హంసవాహినికి ప్రణామం.
కవిత సంఖ్య : 795
మనిషి అంతరంగ సంద్రములో
చిలికే భావ తరంగాలను బంధించే
ఆలోచనా సుమాల పరిమళాలే కద...
మాటలై ... భావప్రకటనలకు ఆధారభూతమై
ఇతరులతో పంచుకో గలిగేది .....
భావరాశిని పోగేసి అక్షరాలలో
నిక్షిప్తపరిచి పదాల మాలలతో
వరదాయినీని అలంకరింప జేసి
కావ్య కన్యకలకు ప్రాణం పోసేది ....
నాగరికతల నడకలలో అనవరతం
అడుగులేయించి అభివృద్ధిపథంలో
పరుగులు పెట్టించి కీర్తి శిఖరాలను
అధిరోహింప జేసేది…..
సంస్కృతి సంప్రదాయాలకు
చరిత్ర పుటల్లో నిలువెత్తు సాక్ష్యాలుగా
నిలిచి … తరాలమధ్య వారధిగా
అభివృద్ధి మంత్రాలను జపించేది ...
పుట్టుకల మూలాలు గుట్టుగా
దాచి...కోటరీలు నిర్మించుకుని
కోట గోడల మధ్య తప్పుల తడకల
చరిత్రలెన్నో చదివించినా .... చెక్కు
చెదరనిదీ… హిమశిఖర సమమైన
నా సంస్కృతి ....
అన్నింటికి మూలమైన చదువులకు
ప్రతిరూపమైన హంసావాహినికి సదా
ప్రణమిల్లే సంప్రదాయానికి వారసున్ని…
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment