Thursday, May 10, 2018

తిలా పాపం తలా పిడికెడు-అందరిది



జగతికి మార్గదర్శకం చేయగలిగిన 
జాతి మనదని ఇంటా  బయట మారు మోగినా 
జడలు విప్పి కరాళ నృత్యం చేస్తుంది, దాని 
జాడలు మాసి పోకుండా చూస్తుంది స్వార్థమనే పెను భూతం 

మన దేశంలో, మన ప్రజలకు, మన సిద్ధాంతాలతో 
మన నాయకులు ఎంతో మంచి సాధిస్తూనే ఉన్నారు కోకొల్లలు. 
విదేశాలు వదిలిన సిద్ధాంతాలతో  వితండ వాదులు  పన్నే కుట్రల్లో 
విచ్చు కత్తులకు బలి అవుతున్నారు కోయలు. 

అమాయకులైతేనే అడ్డగోలుగా ఆటలన్నీ సాగుతాయని 
అడివి బిడ్డలను అల్లుకుని ఆడుతున్నారు అందరు  నాటకాలు. 
కొంతమంది కలాలోళ్లు , కొంతమంది గళాలోళ్లు, కొంతమంది రాజకీయులు,
కొంతమంది అధికారులు, కొంతమంది మాధ్యమాలు, విప్లవ నాయకులు  

చాప కింది నీరులా, కంచే చేను మేసిన వైనంలా 
చట్టాలన్నీ చట్టుబండలవుతూనే ఉన్నాయి అక్కడ . 
స్వార్థమనే గుర్రాలపై స్వారీ చేస్తూ, రాచ పుండును  రంగరిస్తూ 
సమాజములో కుళ్ళును వేళ్ళూనేలా చేస్తూనే ఉన్నారు. 

అధికారంలో ఉన్నవాళ్లో, అప్పోజిషనలో ఉన్నవాళ్లో,
అంతరంగ సమావేశాలతో అవసరాలు చూసుకుంటూ 
అధికారుల(కొంత మంది) అండ దండలతో 
అంతా సంత చేసి వింత చూస్తూ  ఆనందిస్తున్నారు

అణగారిన ప్రజల అవస్థలను ఆసాంతం కనిపెట్టి
అసలు మూలాలు శోధించి అక్షర రూపం గావించి
అమరవీరుల కుటుంబాలను  ఆదుకున్న చందంగా
ఆద్యంతం  నిర్మూలనకై ఆలంబనగా నిలవండి. 

అరువదేండ్ల స్వాతంత్య్రం  గడిచినా 
అణగారిన మారుమూల అడవి  పల్లెల్లో 
అణుమాత్రం విధానాలు మారడం లేదంటే 
అతిశయోక్తి కాదేమో స్వాతంత్ర భారతాన 

అందుకు అందరం బాధ్యత వహించాల్సిందే 

లేదంటే 
స్వార్థం వీడిన నాయకులు దొరికి 
సేవలు తెలిసిన అధికారులు కుదిరి 
విలువలు తెలిసిన మనుష్యులు కలిసి 
విజ్ఞతతో సాధించవచ్చు వెలుగులు వారి జీవితాన 
   

No comments:

Post a Comment