Thursday, May 10, 2018

అంతర్జాలం-భావితరం

మను సిద్ధాంతమో, మరో సిద్ధాంతమో 
పనులకనుకూలమనో, పాలనకనుకూలమనో ,
మతాలు,కులాలుగా ప్రాచుర్యం అయ్యాయి ఆనాడు 
పతనమయ్యాం వాటి వల్లనే అంటున్నారు కొందరు. 

మనం ఏం చేయాలనుకుంటున్నాం రేపటి తరాన్ని
మననం చేసుకుందామా మనకు మనం 
మనసు బెట్టి అందరం ఈనాడు 
మౌనంగా ఉండటం భావ్యం కాదేమో?   

నిశ్శబ్దం చేధిస్తే ఎదో సాధించొచ్చన్నది ఒకప్పటి మాట 
నిస్సంశయముగా ఇల్లు,సంఘం,దేశం సంస్కరించుకోవచ్చు. 
మాధ్యమాలు కొంత, అంతర్జాలం మరి కొంత 
వెరసి స్మార్ట్ ఫోన్లు యువకుల చెంత ....?

ఎంతో అభివృద్ధిని సాధించాం అని కదా మన  ధీమా.
ఎలా ఉండబోతుందా అయినా విశ్వ మానవ భవిత అని 
ఎక్కువ మంది మేధావులు మదన పడుతున్నారీనాడు 
ఎదో విధంగా కాపాడాలనే తాపత్రయం అందరిలో..... 
ఇంట్లో ఉండే వాళ్లంతా  టి వి సీరియల్స్ కు అంకితమౌతుంటే 
ఉద్యోగులు ఉదాసీనత తో సొల్లు రాజకీయాలకు అంకితమౌతుంటే 
కొంత మంది గురువులు కొలువేతర వ్యాపకాలకు అంకితమౌతుంటే 
నాయకులేమో నజరానాలు సర్దుకోవడానికి అంకితమౌతుంటే 
ఎంతో మంది రేపటి పౌరుల జీవితాలు గాలి వాటానికి అంకితమౌతున్నాయి . 

పుట్ట గొడుగుల్లా పుట్టుకొచ్చి ఎలాగోలా నెట్టుకు రావాలని 
తంటాలు పడుతున్న ఛానెల్స్ ఎం సందేశమిస్తున్నాయి యువతకు ?
చడీ చప్పుడు కాకుండా చాప కింద నీరులా ప్రవహిస్తూ  అంతర్జాలం
వికృతాలకు ఆలవాలమైన నియంత్రణ లేని ఎన్నో సైట్లు.... 

యువతే మన దేశ భవిత, బలం అంటున్నాము కానీ 
యువత నడవడి పై నియంత్రణ ఎవరి పాత్ర, ఎవరి పరిధి? 
తల్లి తండ్రులు, గురువులు, నాయకులు అందరూ 
కాసుల వేటకిచ్చిన ధ్యాస,కన్న పిల్లల ఆలనా పాలనలకు ఇవ్వడం లేదు.

యూనిటీ ఇన్ డైవర్సిటీ లాగ - కను సన్నల్లో పిల్లల్ని కాపాడుకోవాలి
యువత బాగుండాలంటే, కొంత కాఠిన్యం తప్పదు 
అమ్మా నాన్నలు, అధ్యాపకులు,ఆలోచన ఉన్నవాళ్లు 
అగ్ర పాలకులు, అధికారులు అందరు పాలు పంచుకోవాల్సిందే. 

అతిక్రమిస్తున్న యువత నేరాలను అరికట్టాలంటే 
అంతర్జాలంపై,మాధ్యమాలపై  అజమాయిషీ ఉండాల్సిందే   
అమలులో  జాప్యం లేకుండా అకుంఠిత దీక్షతో 
అందరం పాలు పంచుకోవాల్సిందే, ఫలాలు అందుకోవాల్సిందే. 

No comments:

Post a Comment