Thursday, May 10, 2018

"విస్తరి " స్తున్న కాలుష్యం


అతిథి దేవోభవ  అన్న ఆర్యోక్తిని 
ఆచరించడమే మన ఆచారం, సాంప్రదాయం 
ఆరోగ్యానికి అత్యుత్తమం ఆకులో భోజనమని 
అందరికి తెలిసినా ఆచరించలేని దుస్థితి 

ఇంటికొచ్చిన అతిథి ఇలవేల్పు తో సమమని 
ఉన్న వాటిలోకెల్ల ఉత్కృష్టమైన వాటిని  
ఉడతా భక్తిగా సమర్పించి సంతుష్టులంజేయ 
యశోవృద్ధియని పచ్చి ఆకులో  "విస్తరి" వడ్డించేవారు. 

అవసరాలు పెరిగాయి లెక్కకు మించి 
అరణ్యాలు తగ్గాయి కారణాలనేకం 
ఆరోగ్యాల మాట అటుంచి అపాయాలు మూట గట్టి 
అందిస్తున్నాము అతిథులకు పాలిథీన్లలో ఈనాడు 

పండంటి జీవితాల కలయికలు (పెళ్లిళ్లు) మొదలు 
ప్రతీ చిన్నా, పెద్దా ఉత్సవాలలో 
పడగ విప్పి నాట్యం చేస్తుంది కరాళ నృత్యం 
పాలిథీన్ల వినియోగం పరాకాష్ట తో  కాలుష్యం

ఫలహారం, ఛాయలు, కాఫీలు నుండి 
పాయసాలు సహా పసందైన విందు భోజనాలు, 
పట్టెడు నీళ్లందించే మంచి నీళ్ల గ్లాసులు, ఐస్క్రీం కప్పులు 
ప్రతీది పాలిథీన్ల మయమే ఈనాడు 

పర్యావరణం పదిలమంటూ ప్రతీవారు గగ్గోలె 
పనితీరులో మాత్రం కనిపించనీయరు జనాలు  
ప్రభుత్వాలన్నీ బాకా భజాయింపులే  కానీ  
పట్టించుకునే పాలక పక్షమే కరువు. 

ప్రకృతి ఎంతో పవిత్రమైనదని 
పదే పదే ఋజువులు దాఖలా అయినా 
పట్టించుకోక పలాయనం చిత్తగిస్తూనే ఉన్నాం 
పవిత్రమైన "విస్తరి" భోజనం పద్ధతి కూడా 

పదే పదే వాడగలిగే పాత్రలే నయం 
పర్యావరణం , ప్రజారోగ్యం పదిలమౌతుంది 
ప్రజలు విజ్ఞతతో పాటించాలి ప్రత్యామ్నాయాలు 
ప్రభుత్వాలు చూపించాలి నూతన తరుణోపాయాలు.

No comments:

Post a Comment