Sunday, June 12, 2011

కమ్మనైన అమ్మతనం

కమ్మనైన అమ్మతనం - అందరికి  అమృతమయం
కానుపుతో   మరో జన్మ- అయినా వెరవదు  అమ్మ

కండరాల పొత్తిల్లలో-  కడుపులోన తొమ్మిది నెలలు
కళ్ళు కాయలు చేసుకొని - కష్టాలను తాను భరించి

పున్నామ నరకాలను - తాను జయించానని
పురుడు పోసుకోగానే - సంబరపడి పోతుంది

పసిడి నవ్వుల పాపాయిని - పూవువలె నిలుపుతుంది
ప్రిథ్వి పైన మమతలతో - లాలించి చనుబాలను అందిస్తుంది

బుగ్గలారిపోకుండా  - ముద్దులెన్నో ఇస్తుంది
చందమామ చూపించి - గోరుముద్దలందిస్తుంది

బుల్లి బుల్లి మాటలను - పదే పదే వల్లిస్తుంది
బుడి బుడి నడకలను - అదే పనిగా నేర్పిస్తుంది

అన్న ప్రాశన ఉత్సవాన్ని-ఆచరిస్తుంది అతి ప్రీతితో
అక్షర శ్రీకారాలను మనకు - అందిస్తుంది కానుకగా

ఎదుగుతున్న పిల్లలను చూసి - మురిసిపోతుంది అమ్మతనం
అక్కున చేర్చుకుని - సేద దీరుతుంది తాను సైతం

అలసటతో విసిగినా  -  కోపగించి కసిరినా
అన్నీ తానై నిలుస్తుంది - అవపోషణ పట్టి అందిస్తుంది

మన కాళ్ళపై మనం నిలిస్తే - మనసెంతో ఉద్విగ్నమై
మంద్రహాసంతో స్పందిస్తుంది - మమకారముతో దీవిస్తుంది

అమ్మే ఓ ప్రకృతి - అమ్మే ఓ ఆకృతి
అమ్మే ఒక నాదం -అమ్మే ఒక  వేదం
అమ్మే ఒక ప్రాణం-అమ్మే ఒక లోకం
అమ్మే ఒక దేవత-అమ్మే భగవద్గీత

అమ్మే ఒక రామాయణం-అమ్మే ఒక పురాణం
అమ్మే ఒక భారతం-అమ్మే ఒక భాగవతం
అమ్మే ఒక ఉపనిషత్తు -అమ్మే ఒక సాంప్రదాయం 
అమ్మే ఒక భక్తి- అమ్మే ఒక ముక్తి

కాలగమనములో మనమంతా - కనుమరుగు అవుచున్నాము సుమా
కమ్మనైన  అమ్మతనపు - గమకాలను గుర్తించక

అమ్మతనపు కమ్మదనం -  ఆస్వాదిస్తే అద్వితీయం
ఆదరిస్తే అనునిత్యం - అవుతుంది ద్విగుణీ కృతం













2 comments:

  1. Very good. I retired from govt of India REC ltd .we can share views. My mail gjlaal@gmail.com

    ReplyDelete
  2. I am very sorry for late reply. thank you very much. sure sir
    we will be in touch in mail.

    ReplyDelete