అంశం - ఇల్లు మారుడు
తేదీ - 06-05-2019
శీర్షిక - ప్రాణ సమానం
సంఖ్య - 178
నాకేమో దగ్గరి మిత్రుల ఓదార్పు ....
మా శ్రీమతికైతే ఇంటి చుట్టు ఆడవాళ్ళ
ఓదార్పులతో బాటు ఏకంగా దుఃఖాలే....
ఇల్లంటే ఇనుమడించిన అనుబంధాలే కదా.....
కష్ట సుఖాలలో, కలిమి లేములలో
కలిసి పంచుకున్న విడదీయరాని బంధాలే కదా...
కకా వికలమయిన మనసుతో నెమరు వేసుకుంటే
కమ్మని అనుభూతులకు లెక్కే లేదు...
.....
ఒకటా రెండా ఏకాంగా
ముప్పై తొమ్మిది సంవత్సరాల అనుబంధం ..
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగం...
పదోన్నతులపై ప్రాంతం మారినా
నివాసాల పద్ధతంతా అదే సుమా ...
వేల ఎకరాల గృహ సముదాయ విస్తీర్ణం
లక్షల మొక్కల పెంపకం ....
శశిరంలో చలితో గజగజ ...
గ్రీష్మం లో ఏకంగా 3 డిగ్రీల వేడి తక్కువ....
అందరూ ఆడిపోసుకునే రామగుండంలో ...
24 *7 నీళ్లు, విద్యుచ్ఛక్తి, , టి వి కేబుల్ కనెక్షన్లు
ఆటలకు,పాటలకు అచ్చమైన వేదికలు
అందరు మెచ్చే ఉద్యానవనాలు
ఆసీన యుక్త ఆట మైదానాలు,
అన్ని రకాల వ్యాపార,వాణిజ్య సముదాయాలు,
ఆరోగ్య యోగా కేంద్రాలు, క్లబ్బులు, కల్యాణ మంటపాలు
ఆటల్లో భాగంగా ఈత కొలను
ఆధ్యాత్మిక కేంద్ర ఆలయాలు,
ఇరుగు పొరుగు ఇరువై ఊళ్లకు కలిపి
ఈగలు దోమల నివారణకు సైతం
ఇంపుగ వార్షిక ఒప్పందాలు .....
గేటెడ్ కమ్యూనిటీలో సెక్యూర్డ్ జీవితాలనిచ్చి
సంఘంలో స్టేటసిచ్చి సంతృప్తిని నింపింది
పండగలకు, ఫర్నీచర్లకు,వాహనాలకు,ఇళ్లకు
బహు చక్కగా అడ్వాన్సులిచ్చి
బతుకంతా బాధ లేకుండా ఓ ఇంటివాణ్ణి కూడా చేసింది .
పట్టాలు పుచుకుని వచ్చిన మాకు
ప్రశిక్షణలిచ్చి పరిణతి నింపింది అమ్మలా
కన్న తల్లి తండ్రులను , కట్టుకున్న ఇల్లాలును
కని పెంచిన పిల్లలను సదా కనిపెట్టుకుంది .
అత్యవసారాలకు ఆదుకుని
అవసరాలన్నీ తీర్చింది.
ఆలన పాలనలతో బాటు
చదువులిచ్చి పిల్లలకు
సంస్కారాలు నేర్పింది.
మా పెళ్లితో ప్రారంభమయిన జీవితాన ....
పిల్లల పురుళ్ళు, పుట్టిన రోజులు ,
అక్షర శ్రీకారాలు, పాఠశాల చదువులు...
వాళ్ళు జీవితాన స్థిరపడడం....
పెళ్లిళ్లు, పేరంటాలు అన్నీ అక్కడే....
చివరకు అమ్మా నాన్నల అంతిమ యాత్రలు
ఇంటికొచ్చిన బంధు బలగాలైతే
ఇంద్రభోగపు బతుకులంటూ కితాబిచ్చేవాళ్ళు ...
ఇల్లు మారిన రోజయితే
గుండె అంతా పిండినట్టు,
గొంతంతా తడారి, నాలుక పిడుచకట్టి
ప్రాణ సమమైన బంధమేదో
బలవంతంగా లాగేసినట్టు
బ్రతుకే భారమేమో... అన్నట్టు
భవిష్యత్ అంతా శూన్యమన్నట్టు
మాటల్లో చెప్పలేని బాధ అనుభవించినది మాత్రం
బలీయమైన వాస్తవం.....
నగునూరి రాజన్న
కరీంనగర్ (ప్రస్తుతం :రిచ్మండ్ )
No comments:
Post a Comment