Saturday, May 25, 2019

అక్షయ తృతీయ

నగునూరి రాజన్న   
అంశం - అక్షయ తృతీయ
తేదీ - 07-05-2019
శీర్షిక - ఇవ్వడం లోన ఇంపు
సంఖ్య - 179

ఆచారాలైతేనేమి ఆర్యులు చెప్పినవైతేనేమి 
కాలానుగుణంగా ప్రకృతిలో జరిగే మార్పులకు 
మనల్ని మనం రక్షించుకోడానికి పాటించే 
ఆరోగ్య రక్షణకు అనువైన సూత్రాలు ...  

సంప్రదాయాలైతేనేమి సంస్కృతి అయితేనేమి 
మహోన్నత మానవ జన్మకు మూలమైన 
మనకు తెలియని మహాత్యమైన అతీత శక్తికి 
ఆరాధనా భావంగా అర్పించుకునే 
ఆధ్యాత్మిక ప్రణామాలు....... ముక్తికి మార్గాలు.

అడుగడుగునా అలరించే పండగలైతేనేమి 
అందరిని ఉత్సాహపరిచే ఉత్సవాలైతేనేమి 
అన్ని దారుల ఉన్నత గమనం ఆ  వైపే 
అది గుర్తెరిగి గమ్యం చేరుట మన ధర్మం. 

యుగం మారి జగం మారగానే 
స్వార్థం పెరిగి సంయమనం కోల్పోయి
ఇవ్వడం లోని ఇంపు సొంపులు తగ్గి  
పుచ్చుకోవడం మాత్రమే పుర్రె గుణమైంది .... 

అక్షయ తృతీయమంటే ..... 
అన్నపూర్ణాదేవి అవతరించిన రోజు 
అందరికి చేర్చాలని సూచించే రోజు 
అన్ని పనులకు అనుకూలం అయినా 
అందరు మెచ్చే పనులు చేయమని.... 
ఆధ్యాత్మికానికి అంకితమవ్వమని .... 
నిన్ను నీవు శోధించుకోమని...  
ఆదిలక్ష్మిని అయ్యవారిని పూజిస్తూ 
అమ్మా నాన్నలను ప్రేమించమని... 
గ్రీష్మ తాపం పెరిగినందున వీలయితే 
ఇతరులకు దాహం తీర్చమని..... 
పొదుపుకో మదుపుకో బంగారం కాని 
పులిని చూసి నక్క వాతకు కాదు
మతమేదయినా ప్రాంతమేదయినా
మంచిని వంచించి చెడును చేరదీయమని కాదు
 చెడును ఛేదించి మంచిని మననం చేసుకోమని...


నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం : రిచ్మండ్ )

No comments:

Post a Comment