పల్లె బాట పట్టాల్సిందే
ఇరుగు పొరుగు తో ఇచ్ఛముగా మాట్లాడాలన్నా
అచ్ఛంగా వరుస కలిపి ఆత్మీయంగా పిలుచుకోవాలన్నా
పెల్లుబికే ఆనందాలు పెనవేసుకు పంచుకోవాలనుకున్నా
పల్లె బాట పట్టాల్సిందే
పాడి పంటల పూర్వోత్తరాలు
పాలు పెరుగు, వెన్న నెయ్యి, పట్టు తేనె విషయాలు,
బియ్యమంటే వడ్లని వివరంగా తెలియాలంటే
అరమరికలు లేకుండా పప్పుల వివరాలు తెలియాలంటే
పల్లె బాట పట్టాల్సిందే
జనమంతా తాగేది మంచి నీళ్లే అయినా
వాగు వంకల్లోని మంచినీటి వనరులు,
బావి,కుంట, చెరువులు బహు లెస్సగా చూడాలనుకుంటే
పల్లె బాట పట్టాల్సిందే
అసలు సిసలైన పండగల సందళ్ళు
ఆత్మీయపు వన భోజనాలు, వారాంతపు సంతలు ,
అనురాగపు ఆనందాల ఆప్యాయతలు చూడాలనుకుంటే
పల్లె బాట పట్టాల్సిందే
అగాధమైన రోడ్లు, అడ్డగోలు ధ్వనులు,
అంతులేని జనం, వింత గొలిపే సందళ్ళు లేని
అందమయిన పశు సంపద, పచ్చని పైర్లు. మట్టి రోడ్లు చూడాలంటే
పల్లె బాట పట్టాల్సిందే
ఇంటింటా చేద బావి, ఇంటి వెనుక పూల మొక్కలు
ఇంపైన కూర పాదులు , పసందైన పండ్ల మొక్కలు
ఇంకుడు గుంతలు, ఇంటి వెనుక జంతు పెంట చూడాలనుకుంటే
పల్లె బాట పట్టాల్సిందే
తెల్లవారితేనే ఉరుకులు పరుగులు లేని
తేటమైన ప్రశాంత జీవనాలు గడపాలనుకుంటే
యాంత్రిక జీవనము నుండి విశ్రాంతం పొందాలనుకుంటే
పల్లె బాట పట్టాల్సిందే
25-04-18
No comments:
Post a Comment