ఓట్ల పండుగ 2019
రడీగుంటారు వరుసబెట్టి నాయక గణం
రాజ్యాధికారుల్ని ఎన్నుకునేది మనం అయినా
రంగు, రుచి, వాసన పసిగట్టాలి సుమా !
పచ్చనోట్లు పార జూపి ఓటెయ్యమంటారు
ప్రాంతం , కులం, గోత్రం జెప్పి బలపరచమంటారు
పానకాలతో ప్రలోభ పెట్టి ప్రయత్నిస్తూంటారు
ప్రశిక్షణ కలిగి మనమే వాళ్ళను దూరం పెట్టాలె.
అడుగడుగునా అవినీతి, లంచగొండితనంతో
అవిటిదైపోయింది ప్రజా సంక్షేమం
అంజనమేసినా అగుపడని అభివృద్ధి
అందుకే మనమంతా ముందు చూపు చూడాలి.
క్రమశిక్షణ కలిగిన పిల్లల కోసం
కఠిన వైఖరి చూపే తల్లి లాగా
మంచి నాయకులను ఎంచుకోవాలంటే
మనమంతా విచక్షణ చూపాల్సిందే.
సగటు మనిషికి ఉపయోగపడే
సర్కారు బడి, సర్కారు దవాఖాన,
సర్కారు రెవిన్యూ, సర్కారు (భూమి,బండ్ల) రిజిస్ట్రేషన్లు
ఎందెందు చూసినా అందందే కలదు అవినీతిమయం.
వారు పోయి వీరొచ్చే డాం డాం డాం
వీరు పోయి వారొచ్చే డాం డాం డాం అంతే గాని
అవినీతి,లంచ గొండి తనం అంతకంతకు పెరుగుచుండె
అధికార్ల తీరుతో అమాయకుల ఖర్మలు మారడం లేదు.
రైతులకు సబ్సిడీలంటారు, కానీ
రెక్కల కష్టానికి మాత్రం సరైన గిట్టుబాటు ఇవ్వరు
నిరుద్యోగులకు భృతులంటారు, కానీ
నిలిచి గెలవడానికి మాత్రం ఉద్యగాలివ్వరు.
బాపన్నలు, గోపన్నలు,రైతన్నలు, నేతన్నలు,గౌడన్నలు, గొల్ల కుర్మన్నలు
బ్రతుకెవరిదైనా బాగు పడాలె కానీ
తాత్కాలిక ఉపశమనాలే కాకుండా
శాశ్వత పరిష్కార మార్గాలు సైతం కావాలి .
కె జి టు పి జి ఉచిత నిర్బంధ విద్య,
అందరికి రక్షణ, అందుబాటైన ఆరోగ్యం ,
కార్యాలయాలలో క్రమశిక్షణలు పెరిగితే
కాన వస్తుంది అభివృద్ధి, కదిలి వస్తుంది ఆనందం.
అంది పుచ్చుకోవచ్చు అందరం స్వర్ణ భారతాన్ని.
20-04-18
No comments:
Post a Comment