నా బాల్యములో
మా పల్లె జీవితం
కల్లా కపటం తెలియని మా పల్లె జనమంతా
అరమరికలు లేకుండా అన్నతమ్ములోలె కల్సి ఉండేటోల్లం
మా పల్లె మాకు తల్లి లాంటిది
మమతా సమతలతో బ్రతుకు బాట నేర్పింది
ఆమడల దూరాలైన అరికాలి ప్రయాణాలే ఆనాడు
ఎడ్లబండ్లు కట్టుకొని ఊర్లోకెళ్లి వచ్చింది
ఎర్రబస్సు ఎక్కి ఎములాడకు పోయొచ్చింది
గుర్తుకొస్తున్నాయి ఆనాటి ముచ్చట్లు
బంధువుల సైకిలోస్తే బతిమాలి తీసుకున్నది
పల్లెకు మోటారు సైకిలో... జీపో వస్తే ...
పడి పడి చూసేటోల్లం - పారేశాన్ అయ్యేటోల్లం
గుర్తుకొస్తున్నాయి ఆనాటి సంఘటనలు
పెద్ద పెద్ద వానలకు మత్తల్లు దునుకుతుంటే
గమ్మత్తుగ చూసి చూసి ఈతలు నేర్చుకున్నది
బడికి బంకులు కొట్టి బాతాఖానీలు కొట్టింది
తెల్లవారి పంతుళ్ళతో చెంప దెబ్బలు తిన్నది
గోటీలు, బొంగరాలు ఆటలతో గింగిరాలు తిరిగింది
కబడ్డీ, చిర్రగొనెలాడి కొట్లాటలు పెట్టుకున్నది
కోతి కొమ్మచ్చి లతో తోటల్లో గంతులేసింది
గుర్తుకొస్తున్నాయి చిన్ననాటి చిలిపి పనులు
ఒర్రె, వాగు వంకల్లో నిలబడి ఉన్న నీళ్లను
యాతమేసి, గూడవేసి, పంటచేన్లకు పెట్టింది
మోటగొట్టి నీళ్లను వరిచేన్లకు పెట్టింది
గుర్తుకొస్తున్నాయి ఆనాటి మధురమైన ఘట్టాలు
దుక్కి దున్ని ఇడుగు, ఇరువాలు జేసి
మూడ్సాలు, గొర్రుప్పి నాట్లు వేసి
కలుపులు తీసి, స్వచ్చమయిన ఎరువులతో
పంటలు పండించిన ఆనాటి విధానాలు గుర్తుకొస్తున్నాయి
జపాన్ ఎరువులంటూ ఉపాయంగ వచ్చినయి
రకరకాల కల్తీ, కాలుష్యాలతో కాసా రాలై
మానవాళి మనుగడకే ప్రశ్నార్థకమై నిలిచినయి ఈనాడు
గుర్తుకొస్తున్నాయి - తొలి నాల్ల రసాయన ఎరువులు
కూలి నాలి కోసం జనం పడిన అగచాట్లు
నగదు పైసలకోసం నాడు పడిన కష్టాలు
కారం అద్దుకొని నాలుకపై, నీళ్లతో కడుపు నింపుకున్న విషయాలు
గుర్తుకొస్తున్నాయి - ఆనాటి కఠినమైన రోజులు
ఉద్యోగిని చూస్తేనే ఉల్లికి పడే జనాలు
సూటి పోటీ మాటల్తో చిన్న సూపు చూసేటోల్లు
మరచిపోలేని మచ్చ కలిగిన ముచ్చట్లు
ఓడలు బండ్లయి, బండ్లు ఓడలైన బ్రతుకుదెరువులు
గుర్తుకొస్తున్నాయి - ఆనాటి అవమానపు ముచ్చట్లు
రెక్కాడితే కానీ డొక్క నిండని నాటి లెక్కలు ఎక్కడికి సరిపోతాయి ఈనాడు
ప్రభుత్వం కల్పిస్తున్న పని కి ఆహార భద్రత పథకాలతో
మీసం మెలేసేటొల్లె గాని ఊళ్ళల్లో
ఎవుసం కూలి చేసే ఆసామే లేడు మన పల్లెల్లో ఈనాడు
రేడియోలు, వార్తాపత్రికలు లేని రోజుల్లో
పక్కూరు ముచ్చట్లు కూడ పదిరోజులకు తెల్సేవి
పోస్టల్ కార్డు, ఇన్లాండు లెటర్లు కాకుండ
అత్యవసర మతలబులకు వింతైన తంతి విధానమే శరణ్యం ఆరోజుల్లో
ఏబదేండ్ల కాల ప్రయాణంలో ఏర్పడిన మార్పులెన్నో
ల్యాండ్ ఫోనుంటేనే రారాజు ఆనాడు
ప్రపంచమే అరిచేతిలో అనే స్మార్ట్ ఫోన్ లేని మనిషి లేడు ఈనాడు
వారెవ్వా అనే వాహనాల సౌకర్యం - ఆపసోపాలు లేని హార్వెస్టర్ల కల్టివేషన్ విధానాలు
టీవీ లు , ఇంటర్నెట్, twitter,
face book, instagram, మొదలైన సోషల్ మీడియాల తో
అప్డేట్ అయినమనుకుంటున్నాము
గాని, మనకు మన పిల్లలకు వీటి వల్ల
అవలక్షణాలెన్నో పొంచి ఉన్నాయి మిత్రమా
ఆదమరిచి అడుగులేయాలి జాగ్రత్తగా నేస్తమా
No comments:
Post a Comment