కరోనా కళ్ళల్లో కారం కొట్టాలనకున్నా
కాలాన్నంతా కింది మీద జేసిందని..కాని
కాలుష్యాలను కడతేర్చి మనకు
మంచి చేసిందనిపిస్తున్నది...!
పర్యావరణం ప్రశాంతమై
స్వచ్ఛమైన వేళ...సంబరాలు
తీర్చుకుందామంటే ముక్కుకు
మూతికి ముసుగు వేసుకోమంటుంది !
రహదారులన్నీ రాచమార్గల్లా
రద్దీలేకుండా ముద్దొస్తుంటే
బుధ్దిదీర వాహనమెక్కి పరుగులు
పెట్టిద్దామంటే పరిమితులు కుదరవాయె!
కలుషితం లేని హస్తమైనా సరే
కల్సుకోక చాన్నాళ్ళైందని...
కలుసుకున్న ఆత్మీయ నేస్తానికి సైతం
కరచాలనం అందించలేని దుస్థితి!
కావాల్సినంత సమయం
కలుసుకోవడానికున్నా ..... మిత్రుల్ని
కలుసుకోలేని కఠిన కాలాలను
కంట చూడాల్సివస్తోంది!
వండి వార్చాలనే కోరిక మాకు
దండిగా ఉన్నా విందారగించ
పొందుగా రాగలిగిన దగ్గరి
బంధువులే కరువాయే !
ఏండ్ల కొద్దీ ఏర్పడ్డ అనుబంధమాయె
సుందరమైన ఇందువారపు ఉదయాన్నే
మంద్రగమనమున ఇంద్ర పదవుల
వెలగబెట్టాలని మనసు పీకినా మారని
సెలవుల చిట్టా...!
ఎద్దున్నవాడికి బుద్ధిలేదన్నట్టు
బుద్ధున్నవాడికి ఎద్దులేదన్నట్టు
డబ్బున్నవాడు ఖర్చు చేయలేక
లేని వాడికి సంపాదించే మార్గం
కరువాయే !
అందివచ్చిన ఖాళీ సమయం
అరచేతిలో ఉన్నా అంధకారపు
అంచున నక్కిన అగుపడని క్రిమి వల్ల
అందుకోలేని కలల సామ్రాజ్యం!
ఎదురు చూద్దాం మంచి రోజుకై....
నగునూరి రాజన్న
కరీంనగరు.
No comments:
Post a Comment