Tuesday, January 30, 2018

గిట్టుబాటు ధర


పీఠభూమి జాగాలన్నీ అధికశాతం 
పిట్టగూళ్ళ రాతి నేలలే సుమా 
బిగి పంటల జిగి నేలలు కానే కాదు 
వరి పంటలు పండాలంటే వాన నీరే ఆధారం 

ఉత్తరాన గలగలా గోదారమ్మా  
దక్షిణాన బిరబిరా కృష్ణమ్మలే కాకుండా 
మంజీర, మానేరు, పెద్దవాగు, కిన్నెరసాని 
ఉపనదులనేకం ఉన్నప్పటికీ ... 

కుంట, చెరువులు కుదురుగా లేవు 
కాలువల్లల్ల నీళ్ళెప్పుడు కండ్ల ముందు పోతాయి గాని 
చివరాఖరి పంట పొలాలకు 
చిగుర్లొచ్చేటందుకు మాత్రం నీళ్లందై 

మూలిగే నక్క మీద తాటి కాయోలే 
ముంచుతున్నరు నకిలీ విత్తనాలు,ఎరువులతో 
పేరుకెన్నో సర్కారు శాఖలున్నాయి  కాని 
పెంపు కానివ్వడము లేదు రైతును ఎవ్వరూ

ఇన్ని కష్టాలు ఇగురంగా దాటినోన్ని కూడా 
గిట్టు బాటు ధరలిస్తం అని ఒట్టు బెట్టి చెప్పినోళ్లు కూడా 
వట్టి పోయిన పశువులోలె మాటలన్నీ మూట కట్టి 
గట్టి పనులెవ్వరూ చెయ్యడం లేదు 

ఏండ్ల తరబడి ఏలికలైతే మారుతూనే ఉన్నారు 
ఏటికాఏడు  ఎదురు సూసుడే  ఎవుసం ఆసాములు
వాళ్లంటే వీళ్ళని, వీళ్లంటే వాళ్ళని 
వాదనలు, ప్రతిపాదనలు, బడ్జెట్ కేటాయింపులే ... 

అరక దున్ని,పంట పండించే రైతన్నకు 
గిట్టు బాటు ధరలు  కట్టుబాటుగా రావాలంటే 
రాయితీలు, రక రకాల గిడ్డంగులు (గోదాములు), 

రాజకీయం చేయకుండా రైతన్నకు అందించాలి

No comments:

Post a Comment